: ఆదర్శంగా నిలుస్తున్న జయశంకర్ జిల్లా కలెక్టర్ మురళి.. కుమార్తెకు ప్రభుత్వ ఆస్పత్రిలో కాన్పు!

ఎదుటివాడికి చెప్పేటందుకే నీతులు వున్నాయి.. అంటాడు ఓ సినీ కవి. అందుకు తగ్గట్టుగానే రాజకీయనాయకులు, ఉన్నతాధికారులు ప్రజల సమక్షంలో పదేపదే ఇలా నీతులు వల్లిస్తుంటారు. కానీ ఆచరణ శూన్యం. అయితే, తెలంగాణలోని జయశంకర్ జిల్లా కలెక్టర్ ఆకునూరి మురళి మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం. నీతులు ఉన్నది ఆచరణకే కానీ చెప్పడానికి కాదని విశ్వసిస్తారు. పురిటి కోసం ఇంటికొచ్చిన కన్న కూతురును ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి ఆదర్శంగా నిలిచారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో జిల్లాలో ‘కాన్పునకు రా తల్లీ’ అనే కార్యక్రమాన్ని చేపట్టారు. దానికి విస్తృత ప్రచారం కల్పించారు. అక్కడితో దానిని వదిలేయకుండా తాను స్వయంగా ఆచరించి ప్రజలకు ఆదర్శంగా నిలిచారు.

హైదరాబాద్‌లో ఉంటున్న గర్భవతి అయిన కుమార్తె ప్రగతిని కాన్పు కోసం 15 రోజుల క్రితం మురళి ఇంటికి తీసుకొచ్చారు. ఇటీవల పురిటినొప్పులు రావడంతో వెంటనే ములుగులోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు ఆమెను పరీక్షించారు. ప్రగతికి థైరాయిడ్ సమస్య ఉండడంతో సుఖప్రసవం అయ్యే వీలులేదని గుర్తించిన వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. డీఎంహెచ్‌వో డాక్టర్ అల్లెం అప్పయ్య పర్యవేక్షణలో శుక్రవారం ప్రగతికి విజయవంతంగా ఆపరేషన్ చేశారు. ప్రగతి పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. మనవరాలిని చేతుల్లోకి తీసుకున్న మురళి తాను తాతనయ్యానంటూ మురిసిపోయారు. ఈ సందర్భంగా కలెక్టర్ మురళి మాట్లాడుతూ సర్కారు దవాఖానాల్లో అన్ని సౌకర్యాలు ఉంటాయని, ఇక్కడ పేద, ధనిక తేడా ఉండదని అన్నారు. ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకే తన కుమార్తెను ములుగు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చినట్టు పేర్కొన్నారు.

More Telugu News