: చిరంజీవి వల్ల ఆ రోజు రజనీకాంత్ నాతో నటించనన్నారు!: రంభ

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వల్ల కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ తనతో నటించనని చెబుతూ ఒక రోజంతా ఆటపట్టించారని వెటరన్ సినీ నటి రంభ తెలిపింది. మీలో ఎవరు కోటీశ్వరుడు? గేమ్ షో ప్రమోషన్ కోసం చిరంజీవితో సరదాగా ఆడిన రంభ గతంలో జరిగిన పలు విషయాలు ఆయనతో పంచుకుంది. ఈ సందర్భంగా 'అరుణాచలం' షూటింగ్ హైదరాబాదులో జరుగుతుండగా, తనను ఓ మీడియా ప్రతినిధి ఇంటర్వ్యూ చేశారని, అప్పుడు తన ఫేవరేట్ హీరో చిరంజీవి అని చెప్పానని గుర్తు చేసుకుంది.

ఈ ఇంటర్వ్యూ ఆరోజే ఒక పత్రికలో వచ్చిందని తెలిపింది. ఆ ఇంటర్వ్యూ చదివిన రజనీకాంత్ 'నీకు ఫేవరేట్ హీరో చిరంజీవి అయితే నాతో నటించడం ఎందుకు? వెళ్లి ఆయనతోనే నటించు, నేనంటే ఇష్టపడే హీరోయిన్లు కూడా చాలా మంది ఉన్నారు' అంటూ ఆ రోజంతా ఆయన తనను ఆటపట్టించారని రంభ తెలిపింది. అయినా అప్పుడైనా ఇప్పుడైనా తన ఫేవరేట్ హీరో చిరంజీవేనని చెప్పింది. పదేళ్ల క్రితం చిరంజీవి ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారని చిరంజీవిని పొగడ్తల్లో ముంచెత్తింది. ప్రతిగా చిరంజీవి కూడా 'నువ్వు కూడా పదేళ్ల క్రితం ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అంతే అందంగా, యవ్వనంగా, చలాకీగా ఉన్నట్టు అనిపిస్తోంది' అంటూ కితాబునిచ్చారు. 

More Telugu News