: మరో దాడి.. ఎయిర్ పోర్టులో ముస్లిం ఉద్యోగినిని వెంబడించి, మోకాళ్లపై కూర్చోబెట్టి అలజడి రేపిన అమెరికన్

ఓ ముస్లిం ఉద్యోగినిపై ఓ అమెరికన్ చేయిచేసుకున్న ఘ‌ట‌న అమెరికాలోని జాన్‌ ఎఫ్‌ కెన్నడీ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. అమెరికాలో విదేశీయుల‌పై దాడులు పెరిగిపోతున్న నేప‌థ్యంలో చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న మ‌రోసారి ఆందోళ‌న రేపింది. రోబిన్‌ రోడ్స్‌(57) అనే అమెరికన్ ఈ ఏడాది జనవరిలో అరుబా దేశానికి యాత్ర కోసం వెళ్లాడు. తాజాగా మసాచూసెట్స్‌ వెళ్లడానికి కనెక్టింగ్‌ విమాన సమాచారం కోసం డెల్టా ఎయిర్‌లైన్స్‌ ఉద్యోగులు ఉండే క్యాబిన్‌కు వెళ్లి అక్కడి ముస్లిం మ‌హిళా ఉద్యోగిని చూశాడు. ఆమెను చూడ‌గానే అత‌డిలోని ద్వేషం బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ఆమె ఏ త‌ప్పూ చేయ‌క‌పోయిన‌ప్ప‌టికీ ఇక్కడ‌ నువ్వు నిద్రపోతున్నావా? లేక నమాజ్‌ చేస్తున్నావా? ఏం చేస్తున్నావ్‌? అంటూ అరిచాడు.

అనంత‌రం త‌న‌కు, ఆ ఉద్యోగినికి అడ్డుగా ఉన్న తలుపును బద్దలు కొట్టి లోప‌లికి ప్ర‌వేశించాడు. దీంతో ఆ ముస్లిం ఉద్యోగిని భయప‌డింది. తాను ఏం తప్పు చేశానని అడిగింది. అయితే అదేమీ పట్టించుకోకుండా 'నిన్ను వదలను' అంటూ అతను ఆమె వ‌ద్ద‌కు దూసుకొచ్చాడు. దీంతో ఆ ఉద్యోగిని వెంటనే బయటకు పరుగులు తీసింది. అయినా వ‌ద‌ల‌ని రోడ్స్ ఆమెను వెంబడించి ప‌ట్టుకొని ఆమెను మోకాళ్లపై కూర్చొబెట్టి ఇస్లాం మత ప్రార్ధనలను ఉద్దేశించి మాట్లాడాడు. ఇస్లాం, ఐసిస్‌ అంటూ పెద్దగా అరిచాడు. త‌మ దేశంలో ఇప్పుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఉన్నాడంటూ నినాదాలు చేసి, ముస్లింలను ట్రంప్ త‌రిమేస్తాడ‌ని అన్నాడు. అత‌డిని అరెస్టు చేసిన పోలీసులు న్యాయ‌స్థానంలో హాజరుపరిచారు. అనంతరం 50 వేల డాలర్ల పూచీకత్తుతో ఆయ‌న‌ బెయిల్‌పై విడుదలయ్యాడు. ఈ చ‌ర్య‌కు గానూ రోడ్స్‌కు నాలుగేళ్లపాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

More Telugu News