: నన్ను అవమానించినందుకు రూ.14 కోట్లు చెల్లించండి... సుప్రీంకోర్టుకి హైకోర్టు జడ్జి లేఖ!

కోల్ కతా హైకోర్టు జడ్జి జస్టిస్ సీఎస్ కర్నన్ ఏకంగా సుప్రీంకోర్టుకే ఝలక్ ఇచ్చారు. తనను కలతకు గురిచేసినందుకు, అవమానించినందుకు గాను రూ.14 కోట్ల పరిహారం చెల్లించాలని చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనాన్ని కోరారు. ఈ మేరకు జస్టిస్ కర్నన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. తమ ముందు విచారణకు హాజరు కావాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన సమన్లను తీసుకునేందుకు నిరాకరించడంతో  జస్టిస్ కర్నన్ కు వ్యతిరేకంగా అత్యున్నత న్యాయస్థానం గత వారం బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. దీనికి కౌంటర్ గా జస్టిస్ కర్నన్ ఏకంగా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనంలోని ఏడుగురు న్యాయమూర్తులపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించారు.

కోర్టు ధిక్కార నోటీసు జారీ చేసినప్పటికీ జస్టిస్ కర్నన్ తమ ముందు హాజరుకాకపోవడాన్ని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చాలా తీవ్రమైన అంశంగా పరిగణించింది. జస్టిస్ కర్నన్ ను మార్చి 31న ఉదయం 10.30 గంటలకు తమ ముందు హాజరుపరచాలని బెయిలబుల్ వారెంట్ ను జారీ చేస్తూ, దాన్ని అమలు చేయాలని పశ్చిమ బెంగాల్ రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ ను ఆదేశించింది. ఆ వెంటనే జస్టిస్ కర్నన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి సుప్రీంకోర్టు ఆదేశాలు.. దళిత జడ్జి అయిన తన జీవితాన్ని సమాధి చేసే యత్నంగా అభివర్ణించారు. ఈ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని ఆదేశించారు.

More Telugu News