: మోటార్ వాహనాల చట్టంలో మార్పులు... తాగి వాహనం నడిపితే రూ.25 వేల జరిమానా!

మద్యం తాగి వాహనం నడిపితే ఇక నుంచి రూ.25 వేలు జరిమానా చెల్లించుకోవాల్సి ఉంటుందని కామారెడ్డి ఎస్పీ శ్వేతారెడ్డి పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం మోటార్ వాహనాల చట్టంలో ప్రభుత్వం మార్పులు చేర్పులు చేస్తూ ఆదేశాలు జారీ చేసిందని ఎస్పీ పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మద్యం తాగి వాహనాలు నడపడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయన్న ఎస్పీ, ప్రతి పోలీస్ స్టేషన్‌కు ఒక బ్రీత్ అనలైజర్‌ను అందించనున్నట్టు తెలిపారు. ఫోన్లో మాట్లాడుతూ వాహనం నడిపితే రూ.5 వేలు, రిజిస్ట్రేషన్, లైసెన్స్, ఇన్సూరెన్స్ పత్రాలు లేకుండా వాహనం నడిపితే రూ. పదివేలు, కాలుష్య నిబంధనలు పాటించకుంటే రూ.1500, సీటు బెల్టు లేకుండా వాహనం నడిపితే రూ.1000 చొప్పున జరిమానా విధిస్తామని హెచ్చరించారు. నిబంధనలను అతిక్రమించి రెండు, అంతకంటే ఎక్కువసార్లు జరిమానాలు చెల్లించిన వారి లైసెన్స్‌లు రద్దు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు.

More Telugu News