: ‘నీట్’పై తమిళనాడును తలంటిన హైకోర్టు.. వ్యతిరేకించడం సిగ్గుచేటని వ్యాఖ్య

నేషనల్ ఎలిజబిలిటీ కం ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) ను వ్యతిరేకిస్తున్న తమిళనాడు ప్రభుత్వానికి ఆ రాష్ట్ర హైకోర్టు తలంటింది. నీట్‌ను వ్యతిరేకించడం సిగ్గుచేటని వ్యాఖ్యానించింది. విద్యార్థులకు తగిన ప్రతిభ లేదని భావిస్తున్నారా? అంటూ సూటిగా ప్రశ్నించింది. మీ విద్యాప్రమాణాలను తక్కువగా అంచనా వేసుకోవడం వల్లే నీట్‌ను వ్యతిరేకిస్తున్నారా? లేక తమిళ విద్యార్థుల సామర్థ్యంపై మీకు నమ్మకం లేదా? అని న్యాయమూర్తి కృపాకరన్ ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రైవేటు కళాశాలల్లో పీజీ సీట్లకు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా ‘నీట్’ నుంచి రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వాలంటూ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపినట్టు ప్రభుత్వ న్యాయవాదులు పేర్కొన్నారు.

 దీంతో స్పందించిన కోర్టు పై విధంగా వ్యాఖ్యానించింది. ఈ  సందర్భంగా పీజీ సీట్ల కేటాయింపుపై కౌంటర్ దాఖలు చేయాలంటూ భారత వైద్య మండలికి కోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రైవేటు విద్యాసంస్థలు సీట్ల వ్యాపారం చేస్తుంటే ప్రభుత్వం చూసీచూడనట్టు వ్యవహరించడం తగదని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజుల నియంత్రణ బాధ్యత వైద్యమండలిదేనని స్పష్టం చేశారు. మెడికల్ కోర్సులో ప్రవేశానికే రూ.15 కోట్లు చెల్లిస్తే అది చదివిన వారి నుంచి ప్రజా సేవ ఎలా ఆశించగలమని ప్రశ్నించారు. ప్రభుత్వ ఖర్చుతో చదివిన విద్యార్థులు పదేళ్లపాటు ప్రభుత్వ వైద్యశాలల్లో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించింది. కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 3కి వాయిదా వేసింది.

More Telugu News