: ఆయన మరింత బలపడితే కష్టమే!: పెరుగుతున్న మోదీ శక్తిపై ఆందోళనలో చైనా!

భారత ప్రధాని మోదీ రోజురోజుకూ బలపడుతుండటంపై చైనా ఆందోళన చెందుతోంది. ఇది తమకు అంత శ్రేయస్కరం కాదని భావిస్తోంది. ఇప్పటికే దేశీయ, అంతర్జాతీయ వ్యవహారాల్లో మోదీ దృఢ వైఖరిని అవలంబిస్తున్నారని... బీజేపీ మరింత బలపడితే ఆయన వైఖరి మరింత కఠినతరం అవుతుందని చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలోని గ్లోబల్ టైమ్స్ తెలిపింది. 2019 ఎన్నికల్లో సైతం బీజేపీ ఘన విజయం సాధిస్తుందని అంతర్జాతీయ మాధ్యమాల్లో వస్తున్న కథనాలను కూడా ఈ పత్రిక ప్రస్తావించింది.

ఇతరులను బాధించడం మంచిది కాదనే వైఖరితో ఇన్నాళ్లు భారత్ ఉండేదని... మోదీ రాకతో ఆ వైఖరి మారిపోయిందని తెలిపింది. ఇతర దేశాలతో ఉన్న వివాదాలను పరిష్కరించుకునే క్రమంలో, గరిష్ట స్థాయిలో రాబట్టుకోవడమే లక్ష్యంగా మోదీ పని చేస్తున్నారని పేర్కొంది. 2019 ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే... మోదీ వైఖరి మరింత కఠినతరంగా మారుతుందని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో, ఇతర దేశాలతో వివాదాల పరిష్కారం మరింత కఠినతరం అవుతుందని చెప్పింది.

భారతీయులు ఘనంగా జరుపుకునే దీపావళి పండుగను భారత్-చైనా సరిహద్దుల్లో సైనికులతో కలసి మెదీ జరుపుకోవడాన్ని గ్లోబల్ టైమ్స్ ప్రస్తావించింది. ఈ చర్యతో మోదీ తన దృఢ వైఖరిని చాటుకున్నారని అభిప్రాయపడింది. సరిహద్దు వివాదం ఇప్పట్లో పరిష్కారం అయ్యే సూచనలు కనిపించడం లేదని పేర్కొంది.

More Telugu News