: మంత్రివర్గ విస్తరణ ఆలోచనలో ప్రధాని మోదీ... ఏప్రిల్ 12 తర్వాత ముహూర్తం

ప్రధాని నరేంద్ర మోదీ కేంద్రంలో అధికారం చేపట్టి మూడేళ్లు కావస్తోంది. ఎన్నికలకు మరో రెండేళ్ల సమయమే ఉండడంతో... మంత్రివర్గంలో మార్పులు, చేర్పులపై ఆయన దృష్టి పెట్టినట్టు సమాచారం. ఏప్రిల్ 12తో పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మంత్రివర్గంలో ఉన్న ఖాళీలను భర్తీ చేయడం, కొత్తవారికి చోటు ఇవ్వడం ఈ రెండు అంశాల ఆధారంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని పేర్కొన్నాయి. ఇప్పటికే సహాయ మంత్రులుగా చక్కగా రాణిస్తున్న వారికి ప్రమోషన్లు కూడా ఉంటాయని తెలుస్తోంది.

రక్షణ మంత్రిగా ఉన్న మనోహర్ పారికర్ గోవా ముఖ్యమంత్రిగా వెళ్లిపోవడంతో ఆయన నిర్వహించిన బాధ్యతలను ప్రధాని మోదీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి అప్పగించారు. నిజానికి ఆర్థిక శాఖ, రక్షణ శాఖలు చాలా పెద్దవి. కనుక ఈ రెండింటినీ జైట్లీయే నిర్వహించే పరిస్థితి లేదు. ఈ దృష్ట్యా మంత్రివర్గ విస్తరణ చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇక విదేశాంగ శాఖా మంత్రిగా ఉన్న సుష్మాస్వరాజ్ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స  చేయించుకున్న నేపథ్యంలో ఆమె నిర్వహిస్తున్న శాఖ విషయంలోనూ మార్పులు ఉంటాయన్న సమాచారం వినిపిస్తోంది.

మోదీ చివరిసారిగా గతేడాది జూలైలో మంత్రివర్గ విస్తరణ చేపట్టారు. స్మృతి ఇరానీని మానవవనరుల శాఖ నుంచి తప్పించి టెక్స్ టైల్స్ శాఖకు పంపారు. సదానందగౌడను న్యాయశాఖ నుంచి గణాంకాల శాఖకు మార్చారు. వెంకయ్యనాయుడికి అదనంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బ్రాడ్ కాస్టింగ్ శాఖను అప్పగించారు. ఎంజే అక్బర్ కు విదేశాంగ శాఖ సహాయ మంత్రి బాధ్యతలు అప్పగించారు.

More Telugu News