: జగన్‌ మాట్లాడుతుండగా మైక్ కట్.. స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లిన వైసీపీ సభ్యులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ స‌మావేశాలు కొన‌సాగుతున్నాయి. అయితే, ప్రశ్నోత్తరాల సమయంలో పోలవరం ప్రాజెక్ట్ అంశంపై ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ... ప్ర‌భుత్వంపై ప‌లు ప్ర‌శ్న‌లు సంధించింది. ఆ ప్రాజెక్ట్ చట్టప్రకారం ఏపీకి రావాల్సిన హక్కని, అయితే ఆ ప్రాజెక్ట్‌పై చంద్ర‌బాబు స‌ర్కారు గొప్పలు చెప్పుకుంటూ త‌మ ప్ర‌భుత్వ కృషి వల్లే వ‌చ్చిన‌ట్లు పేర్కొంటోంద‌ని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత‌ జగన్ విమర్శించారు. విభజన సమయంలోనే పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్‌గా గుర్తించారని, ముంపు మండలాలను రాష్ట్రంలో కలుపుతూ చట్టంలో పొందుపర్చారని అన్నారు.

అయితే, జగన్‌కు ప్ర‌భుత్వం స‌మాధానం చెప్పే నేప‌థ్యంలో కాసేపు వాగ్వివాదం చెల‌రేగింది. అనంత‌రం ఏపీ మంత్రి దేవినేని ఉమ మాట్లాడిన తర్వాత మరోసారి వైఎస్‌ జగన్ మాట్లాడే ప్ర‌య‌త్నం చేశారు. దీంతో ఆయ‌న‌ మైక్‌ కట్‌ అయింది. దీంతో ఆగ్ర‌హం తెచ్చుకున్న వైసీపీ స‌భ్యులు స్పీకర్‌ పోడియం వద్ద‌కు దూసుకువెళ్లి నిరసన వ్యక్తం చేయగా, స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్ రావు స‌భ‌ను పది నిమిషాల పాటు వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

More Telugu News