: రాష్ట్రపతిగా అద్వానీ.. గురుదక్షిణ ఇలా చెల్లించుకోనున్న మోదీ!

బీజేపీ సీనియర్ నేత లాల్‌కృష్ణ అద్వానీ రాష్ట్రపతి కానున్నారనే వార్త ఇప్పుడు ఢిల్లీ వీధుల్లో చక్కర్లు కొడుతోంది. గురుదక్షిణగా ఈ పదవిని ఆయనకు ఇవ్వాలని ప్రధాని నరేంద్రమోదీ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఆయన తన సన్నిహితుల వద్ద చెప్పినట్టు సమాచారం. మోదీ ఈ నెల 8న గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయాన్ని సందర్శించారు. అద్వానీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, మాజీ ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారి మధ్య రాష్ట్రపతి అంశం ప్రస్తావనకు వచ్చింది. దీంతో సోమనాథుడి సాక్షిగా అద్వానీని రాష్ట్రపతిని చేస్తానని మోదీ హామీ ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారం.

బీజేపీలో పలువురు నేతలు రాష్ట్రపతి రేసులో ఉన్నప్పటికీ గతంలో ఇచ్చిన హామీ మేరకు అద్వానీకే ఆ పదవి ఇవ్వాలని ఆర్ఎస్ఎస్ నేతలు సైతం ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీనికి తోడు 2014 ఎన్నికల సమయంలో ప్రధాని అభ్యర్థిగా అద్వానీ, మోదీ మధ్య తీవ్ర పోటీ ఎదురైంది. దీంతో బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రపతి పదవి ఇస్తామని అప్పట్లో అద్వానీకి హామీ ఇచ్చి బుజ్జగించారు. ఇప్పుడు యూపీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా 325 సీట్లు గెలుచుకోవడంతో రాష్ట్రపతిగా తనకు నచ్చిన వ్యక్తినే నియమించే అవకాశం మోదీకి దక్కింది. దీంతో అద్వానీకి రాష్ట్రపతి పదవి ఇచ్చి, సమున్నత రీతిలో ఆయనను గౌరవించాలని మోదీ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని బీజేపీ నేతలు కూడా చెబుతున్నారు.

More Telugu News