: క్రికెట్ లో టెస్ట్ మ్యాచ్ లు ప్రారంభమై నేటికి సరిగ్గా 140 సంవత్సరాలు!

ప్రపంచంలోని క్రికెట్‌ అభిమానులకు నేడు చాలా ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే, అంతర్జాతీయ క్రికెట్ లో టెస్టు మ్యాచ్ లు ప్రవేశించి నేటికి సరిగ్గా 140 సంవత్సరాలు పూర్తయింది. అంతర్జాతీయ క్రికెట్ లో తొలి టెస్టు మ్యాచ్ చిరకాల ప్రత్యర్థులు ఇంగ్లండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య 1877 మార్చి 15న ఆస్ట్రేలియాలోని మెల్‌ బోర్న్‌ క్రికెట్‌ స్టేడియంలో జరిగింది. నాలుగు రోజులు జరిగిన ఈ మ్యాచ్‌ మార్చి 19న ముగిసింది. ఇంగ్లండ్ జట్టుపై ఆస్ట్రేలియా 45 పరుగుల తేడాతో విజయం సాధించి, చరిత్ర పుటల్లో తన స్థానం చిరస్థాయిగా నిలుపుకుంది. ఆ తర్వాత వందేళ్లకు 1977లో ఆస్ట్రేలియాలో అంతర్జాతీయ టెస్టు క్రికెట్ ఉత్సవాలను నిర్వహించారు. దానిని పురస్కరించుకుని 1977 మార్చి 12న మళ్లీ మెల్‌ బోర్న్‌ స్టేడియం వేదికగా తొలి టెస్టు ఆడిన జట్ల మధ్య మళ్లీ టెస్టు నిర్వహించారు. ఈ టెస్టులో కూడా తొలి టెస్టు మాదిరిగా 45 పరుగులు తేడాతో ఆసీస్ విజయం సొంతం చేసుకుంది.

కాలక్రమంలో చోటుచేసుకుంటున్న మార్పుల నేపథ్యంలో ఐసీసీ 2012 అక్టోబరులో కీలక మార్పులు చేపట్టింది. డే అండ్‌ నైట్‌ టెస్టులను నిర్వహించాలంటూ ప్రతిపాదించింది. దీంతో 2015 నవంబరు 27న ఆడిలైడ్‌ వేదికగా ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌ మధ్య డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్‌ నిర్వహించారు. అంతర్జాతీయ క్రికెట్ లో ఇప్పటి వరకు మొత్తం 2,254 మ్యాచ్‌ లు (ప్రస్తుతం శ్రీలంక-బంగ్లాదేశ్‌ మధ్య జరుగుతోన్న టెస్టుతో కలిపి) జరిగాయి. ఇందులో అత్యధికంగా 983 టెస్టులాడిన ఇంగ్లండ్ జట్టు నెంబర్ వన్ స్థానంలో నిలవగా, అందులో 351 విజయాలు మాత్రమే సాధించింది. ఆస్ట్రేలియా జట్టు 799 టెస్టులాడి ద్వితీయ స్థానంలో నిలిచింది. దాని తరువాతి స్థానంలో 510 టెస్టులాడిన భారత జట్టు నిలిచింది.

కాగా, భారత జట్టు తొలి టెస్టును ఇంగ్లండ్ జట్టుతో 1932 జూన్‌ 25న ఆడింది. ఈ మ్యాచ్ లో 158 పరుగుల తేడాతో భారత్ పరాజయం పాలైంది. భారత జట్టు 138 టెస్టుల్లో విజయం సాధించగా, 158 టెస్టుల్లో పరాజయం పాలైంది. 213 జట్లు డ్రాగా ముగిశాయి. దీనిని పురస్కరించుకుని గూగుల్ ప్రత్యేకమైన డూడుల్ ను రూపొందించింది. ఈ డూడుల్ లో బ్యాట్స్‌ మెన్‌, బౌలర్లు ఫీల్డర్లు కనిపిస్తారు. బ్యాట్స్‌ మెన్‌ కొట్టిన బంతిని పట్టుకునేందుకు ఫీల్డర్లు ప్రయత్నిస్తున్నట్లుగా ఉంటుంది. 

More Telugu News