: ఢిల్లీ రెస్టారెంట్లలోని టాయిలెట్లను డబ్బులు చెల్లించి ఇక ఎవరైనా సరే వాడుకోవచ్చు!

అత్యవసరంగా ఒకటికి, రెండుకు వెళ్లాల్సి వస్తోందా...? సమీపంలో రెస్టారెంటు ఉందేమో చూడండి. శుభ్రంగా పని పూర్తి చేసుకోవచ్చు. అదేంటి... అన్న ఆశ్చర్యం కలిగిందా? నిజమేనండి. దేశ రాజధానిలోని రెస్టారెంట్లు ఇకపై పబ్లిక్ టాయిలెట్లుగానూ పనిచేయనున్నాయి. ఇంతవరకు ఆయా రెస్టారెంట్లలోని టాయిలెట్లలోకి ప్రవేశం కేవలం అక్కడి కస్టమర్లకే వుండేది. ఇకపై ఎవరైనా గానీ రూ.5 వరకు రుసుము చెల్లించేందుకు సిద్ధపడితే వారు తమ అత్యవసర పనులను అక్కడ కానిచ్చేసుకోవచ్చు. అంటే ఆకలయితే కడుపు నింపుకోవడానికీ, అవసరం ఏర్పడితే కడుపు ఖాళీ చేసుకోవడానికీ ఇవి వేదికలు కానున్నాయి.

ఇందుకు అనుకూలంగా దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా 4,000కు పైగా టాయిలెట్లు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని మున్సిపల్ కార్పొరేషన్ ప్రకటించింది. మరీ ముఖ్యంగా టాయిలెట్లు అందుబాటులో లేక ఇబ్బంది పడుతున్న మహిళలకు సౌకర్యంగా ఉంటుందని వివరించింది. ఇందుకు సంబంధించిన నిబంధనలను కూడా తీసుకొస్తామని, హోటళ్లకు లైసెన్స్ లు ఇచ్చే షరతుల్లో ఇది కూడా ఉంటుందని తెలిపింది.

అయితే, మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయం పట్ల రెస్టారెంట్ల యజమానుల సంఘం మాత్రం భిన్నంగా స్పందించింది. ఈ విధంగా తమను ఇబ్బంది పెట్టడం సరైంది కాదని పేర్కొంది. ప్రవేశాలు పరిమితం అన్న తమ హక్కులను కాలరాయడంగా అభివర్ణించింది. భద్రతాపరమైన అంశాలను కూడా లేవనెత్తింది.

More Telugu News