: అనంతపురంలో వింత... బోరు వేయకుండానే పిడుగు పాటుకి ఉబికి వస్తున్న గంగ!

గుక్కెడు నీటి కోసం పరితపించే అనంతపురం జిల్లాలో ఓ వింత చోటుచేసుకుంది. చిలమత్తూరు మండలం వై (యగ్నిశెట్టిపల్లి) గొల్లపల్లిలో నేటి మధ్యాహ్నం ఉరుములతో కూడిన జల్లులు కురిశాయి. ఈ క్రమంలో గొల్లపల్లిలోని కురుబ నారాయణప్పకు చెందిన పాడుబడిన బావిలో ఓ పిడుగు పడింది. గత 30 ఏళ్లుగా ఎండిపోయి ఉన్న బావిలో పిడుగు పడగానే అద్భుతం జరిగినట్టు ఒక్కసారిగా పాతాళగంగ ఉబికి వచ్చింది. అటువైపు వెళుతున్న గ్రామస్థులు బావిలో ఉబికి వస్తున్న ఆ నీటిని చూసి ఆశ్చర్యపోయారు.

ఈ వింతను చూడ్డానికి సమీప గ్రామాలవారు కూడా గొల్లపల్లికి తరలివస్తున్నారు. గంగమ్మ ఇలాగే జిల్లాలోని అన్ని గ్రామాలనూ కరుణిస్తే జిల్లాలోని రైతులు వలసలు మానేసి నాణ్యమైన వ్యవసాయం చేసుకుంటారని హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలంలోని గుంగోడు గ్రామానికి చెందిన రైతు శ్రీనివాస ఆచారి పొలంలో బోరు వేయగా విద్యుత్ మోటర్ అవసరం లేకుండా పాతాళ గంగ పైకి ఉబికివచ్చిన విషయం తెలిసిందే. ఈ వింత జరిగి నెల రోజులు కూడా గడవక ముందే పిడుగు పాటుకు నీరు ఉబికి రావడం అనంతపురం వాసుల్లో ఆనందం నింపుతోంది.

More Telugu News