: అసెంబ్లీలో అఖిల ప్రియ‌తో అస‌త్యాలాడించారు: గిడ్డి ఈశ్వరి

ఈ రోజు జ‌రిగిన శాస‌న‌స‌భ స‌మావేశంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వ‌రి విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ రోజు ఆమె విజ‌య‌వాడ‌లో మీడియాతో మాట్లాడుతూ... అసెంబ్లీలో ఈ రోజు భూమా నాగిరెడ్డికి సంతాప తీర్మానం కార్యక్రమం జ‌రిపారా? లేక త‌మ నాయ‌కుడు జగన్మోహ‌న్‌రెడ్డిపై విమర్శల కార్య‌క్ర‌మ‌మా? అని ఆమె ప్ర‌శ్నించారు. టీడీపీ శవ రాజకీయాలు చేస్తోందని ఆమె అన్నారు. భూమా శోభా నాగిరెడ్డి ఒకప్పుడు టీడీపీలో ప్ర‌ధాన‌ పాత్ర పోషించార‌ని, ఆమె మ‌ర‌ణించిన‌ప్పుడు టీడీపీ నేత‌లు సంతాపం తెలిపేందుకు ఎందుకు రాలేదని ప్ర‌శ్నించారు.

అప్పట్లో శాస‌న‌స‌భ‌లో శోభా నాగిరెడ్డికి సంతాప తీర్మానం తెలిపేందుకు కూడా టీడీపీ ఇష్టపడలేదని గిడ్డి ఈశ్వరి అన్నారు. అప్పుడు అలా ప్రవర్తించిన తీరు ఇప్పుడు చంద్ర‌బాబుకి గుర్తుకు రావడం లేదా? అని నిల‌దీశారు. శోభా నాగిరెడ్డి మృతిచెందితే ఆ స్థానంలో టీడీపీ తమ పార్టీ అభ్యర్థిని ఎందుకు నిలబెట్టింద‌ని ఆమె అడిగారు. భూమా నాగిరెడ్డి త‌మ పార్టీలో ఉన్నప్పుడు ఆయనపై రౌడీషీట్ పెట్టార‌ని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించార‌ని ఆమె అన్నారు. ఆయ‌న‌ను వేధింపులకు గురి చేసింది ఎవరో చెప్పాలని నిల‌దీశారు.

హిందూ సంప్రదాయం ప్రకారం కుటుంబంలో ఓ వ్యక్తి చనిపోతే ఆ కుటుంబానికి చెందిన వ్య‌క్తి కనీసం మూడురోజుల పాటు ఊరి పొలిమేర దాటరని, అటువంటిది పుట్టెడు దుఖంలో ఉన్న అఖిలప్రియను శాస‌న‌స‌భ‌ సమావేశాలకు తీసుకురావడం ఏంట‌ని గిడ్డి ఈశ్వరి ప్ర‌శ్నించారు. ఇందులో చంద్రబాబుతో పాటు లోకేశ్‌ పాత్ర కూడా ఉందని ఆరోపించారు. అఖిలప్రియ ప‌డుతున్న‌ బాధ, ఆవేదనను తాము అర్థం చేసుకుంటామని చెప్పారు. అటువంటిది ఓ అమాయకురాలితో అస‌త్యాలాడించార‌ని ఆమె అన్నారు. తన అంతట తానుగానే అసెంబ్లీకి వచ్చానని అఖిలప్రియతో చంద్ర‌బాబు అస‌త్యాలు చెప్పించారని ఆమె అన్నారు. ఆమెనే బలవంతంగా సమావేశాలకు రప్పించారని ఆమె అన్నారు. అమ‌రావ‌తిలో శాస‌న‌స‌భ‌ సమావేశాల ప్రారంభం సంద‌ర్భంగా కూడా హాజరు కాని అఖిలప్రియ, ఇప్పుడు తండ్రి చనిపోయి మూడు రోజులు కాకుండానే సభకు ఎలా వచ్చారని ఆమె ప్ర‌శ్నించారు.

More Telugu News