: భూమా చివరి క్షణాల గురించి అఖిలప్రియ మాటల్లో..!

అనునిత్యమూ ప్రజల గురించి ఆలోచించే వ్యక్తికి తాను కుమార్తెగా జన్మించడం ఎంతో గర్వంగా ఉందని భూమా అఖిలప్రియ వ్యాఖ్యానించారు. ఆపై ఉబికివస్తున్న దుఖాన్ని దిగమింగుకుంటూ తన తండ్రి చివరి క్షణాల గురించి ఆమె గుర్తు చేసుకున్నారు. ఇంట్లో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ను తొలుత ఆళ్లగడ్డకు, ఆపై నంద్యాలకు తీసుకు వెళ్లామని చెప్పారు. మెరుగైన చికిత్స కోసం తానెంతో తపించానని, ఎయిర్ లిఫ్ట్ చేయించేందుకు సహకారం అందించాలని ముఖ్యమంత్రికి ఫోన్ చేసి ఏడ్చానని చెప్పుకొచ్చారు.

ఆపై తనను భయపడవద్దని, అన్ని ఏర్పాట్లూ చేయిస్తానని ఆయన ధైర్యం చెప్పారని, అరగంటకే హెలికాప్టర్ సిద్ధమైందని, హైదరాబాద్ కు తీసుకువెళ్లాలని భావించామని, అప్పటికే దురదృష్టంకొద్దీ ఆయన ఆరోగ్యం స్థిరంగా నిలవలేదని అన్నారు. ఆయన హార్ట్ బీట్ ఆగిందని డాక్టర్లు చెప్పిన తరువాత కూడా, మరోసారి ప్రయత్నించాలని తాను కోరానని, ఆపై రెండు గంటలపాటు వైద్యులు శ్రమించారని చెప్పుకొచ్చారు. పంప్ చేస్తుంటే, హార్ట్ బీట్ వస్తోందని, చెయ్యి తీసేస్తే హార్ట్ బీట్ పోతూ ఉందని, దీంతో తిరిగి గుండె కొట్టుకునే అవకాశాలు ఉన్నాయన్న ఆలోచనతో గంటల పాటు వైద్యులు కృషి చేశారని తెలిపారు.

అదే ఆసుపత్రిలో అదే బెడ్ పై తన తల్లి చనిపోయిందని, ఇప్పుడు అదే బెడ్ పై తన తండ్రి కూడా మరణించారని, వారిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని కన్నీరు పెట్టుకున్నారు. తన తల్లి చనిపోయిన తరువాత, మూడేళ్ల పాటు తండ్రి బతికున్నారంటే, తమకోసమేనని ఇప్పుడు అర్థమవుతోందని చెప్పారు. తానింక అనాధను కాదని, తన వెంట అసంఖ్యాక కార్యకర్తల బలం, చంద్రబాబు, లోకేష్ ల తోడు ఉందని అన్నారు. భరించలేని బాధను అభివృద్ధిపై కసిగా మార్చుకుని శ్రమిస్తానని చెప్పారు. 

More Telugu News