: అన్నదానం వీడియో కోసం వచ్చి తిరుమలపై మనసు పారేసుకున్న నేషనల్ జియోగ్రాఫిక్ చానల్... వెంకన్న వైభవంపై ఏకంగా రెండు ఎపిసోడ్ ల స్టోరీ

నిత్య కల్యాణం, పచ్చ తోరణం... 24 గంటలూ భక్తులతో కిటకిటలాడుతుండే వీధులు... లక్షల మంది ఆకలి తీర్చే అన్నసత్రాలు, నిత్యసేవలు, బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక కార్యక్రమాలు... తిరుమలగిరులపై వెలసి భక్తుల కొంగు బంగారమైన వెంకన్న వైభవం ఎంత చెప్పినా తక్కువే. ప్రపంచ స్థాయిలో పేరున్న నేషనల్ జియో గ్రాఫిక్ చానల్ సైతం వెంకన్న వైభవానికి అబ్బురపడిపోయింది. ప్రముఖ ఆలయాల్లో జరుగుతున్న అన్నదానాలపై 'మెగా కిచెన్' పేరిట డాక్యుమెంటరీ ప్లాన్ చేసుకుని, అందులో భాగంగా రెండు నిమిషాల క్లిప్పింగ్స్ కోసం తిరుమలకు వచ్చిన ఎన్జీసీ టీమ్, వెంకన్న వైభవాన్ని స్వయంగా తిలకించి, 'తిరుమల తిరుపతి ఇన్ సైడ్ స్టోరీ' పేరిట ఏకంగా రెండు ఎపిసోడ్ లతో 43 నిమిషాల డాక్యుమెంటరీని తీసింది.

ఇక్కడి భక్తజన సందడి, ఆహ్లాదకర వాతావరణం, వెంకన్న వైభవాలను చూసిన ఎన్జీసీ టీమ్, వచ్చిన పనిని పక్కనబెట్టి, ఆరు నెలల పాటు శ్రమించి, బ్రహ్మోత్సవాల నుంచి నిత్య సేవల వరకూ వీడియో తీసింది. మొత్తం ఆరుగురు సభ్యులున్న ఈ బృందం తీసిన డాక్యుమెంటరీ ఈనెల 27 రాత్రి ప్రసారం కానుంది. ఏళ్ల తరబడి క్రమం తప్పకుండా తిరుమలకు వస్తున్న భక్తుల అభిప్రాయాలు, వారిలో తన్మయత్వంతో కూడిన భావోద్వేగాలను ఎన్జీసీ కెమెరామెన్లు చక్కగా చిత్రీకరించారని స్వయంగా టీటీడీ సభ్యులే చెబుతున్నారు. నిబంధనల్లో భాగంగా, ఈ కార్యక్రమాన్ని టీటీడీ అధికారులకు చూపించగా, వారు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం అద్భుతంగా ఉందని స్వయంగా ఈఓ సాంబశివరావు ప్రశంసించడం గమనార్హం. శ్రీవారి వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేసేలా ఈ డాక్యుమెంటరీ ఉందని వెల్లడించారు.

More Telugu News