: అంతడబ్బు మా వద్ద లేదు.. ‘కామన్వెల్త్’ మా వల్ల కాదంటూ కాడిపడేసిన దక్షిణాఫ్రికా!

2022 కామన్వెల్త్ క్రీడల ఆతిథ్య హక్కుల్ని దక్కించుకుని, రెండేళ్ల కిందటే ఏర్పాట్లు కూడా మొదలుపెట్టిన డర్బన్ (దక్షిణాఫ్రికా) ఎవరూ ఊహించని విధంగా మధ్యలోనే కాడిపడేసింది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో ఆతిథ్య హక్కుల్ని కోల్పోవాల్సి వచ్చింది. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందకపోవడం, బిడ్ దక్కించుకున్నాక రెండేళ్ల కాల వ్యవధిలో నిర్దేశించిన సన్నాహాలు వేగవంతం చేయలేకపోవడం, బడ్జెట్ కుదిస్తూ ప్రతిపాదించిన కొత్త నమూనాను కామన్వెల్త్ క్రీడల సమాఖ్య(సీడబ్ల్యూజీఎఫ్) అంగీకరించకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో డర్బన్ ఆతిథ్య హక్కుల్ని వదులుకుంది.

తమ వద్ద తగినంత డబ్బులేకే ఆతిథ్య హక్కుల్ని వదులుకోవాల్సి వచ్చిందని దక్షిణాఫ్రికా క్రీడల మంత్రి తెలిపారు. దీంతో అన్ని అంశాలు పరిశీలించాక 2022 కామన్వెల్త్ క్రీడల ఆతిథ్య హక్కుల్ని డర్బన్ నుంచి వెనక్కి తీసుకుంటున్నట్టు సీడబ్ల్యూజీఎఫ్‌ పేర్కొంది. కామన్వెల్త్ క్రీడల ఆతిథ్యాన్ని దక్షిణాఫ్రికా తొలిసారి దక్కించుకోవడంతో దేశవ్యాప్తంగా సంతోషం వ్యక్తమైంది. అయితే తాజా ఘటనతో అది ఆవిరైంది. కాగా వచ్చేడాది క్వీన్స్‌ల్యాండ్(ఆస్ట్రేలియా)లో కామన్వెల్త్ క్రీడలను నిర్వహించనున్నారు. ఇక 2022 క్రీడల నిర్వహణ నుంచి డర్బన్ తప్పుకోవడంతో వాటి నిర్వహణకు తాము సిద్ధమని లివర్‌పూల్ సిటీ(బ్రిటన్) పేర్కొంది. 2010లో భారత్ కామన్వెల్త్ క్రీడలను నిర్వహించింది.

ఒకప్పుడు మెగా టోర్నీల నిర్వహణకు వివిధ దేశాలు పోటీలు పడేవి. ఆతిథ్య హక్కులు దక్కించుకోవడాన్ని గొప్పగా భావించేవి. అయితే ఇటీవల పరిస్థితిలో క్రమంగా మార్పు కనిపిస్తోంది. సంపన్న దేశాలు సైతం టోర్నీల నిర్వహణకు వెనకడుగు వేస్తున్నాయి. 2024 ఒలింపిక్స్ ఆతిథ్యం కోసం బిడ్ వేసిన ఐదు దేశాల్లో ఇప్పటికే మూడు వెనక్కి తగ్గడం ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ.

 

More Telugu News