: పాత నోట్ల మార్పిడి దందా... పరారీలో సినీ దర్శకుడు!

ఓ సినీ దర్శకుడి ఇంట్లో  పాత నోట్ల మార్పిడి దందాకు సంబంధించిన ముఠాను హైదరాబాద్ లోని బంజారా హిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.1.2 కోట్ల విలువైన పాత నోట్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో ఉన్న కమలాపురి కాలనీలో నివసిస్తున్న దర్శకుడు రామకృష్ణ అలియాస్ కిట్టూ తన కార్యాలయాన్ని అడ్డాగా చేసుకుని పాత నోట్ల దందాకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్ లోని గోషామహల్ కు చెందిన వ్యాపారవేత్త దిలీప్ కుమార్, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన వ్యాపారవేత్త కె. ప్రసాద్, ముంబయికి చెందిన మరో వ్యాపారవేత్త వసీం ఖాన్ తమ వద్ద ఉన్న పాత నోట్లను మార్చుకునేందుకు డైరెక్టర్ రామకృష్ణను కలిశారు.

దిలీప్ కుమార్, ప్రసాద్, వసీంఖాన్ లు వరుసగా రూ.20 లక్షలు, రూ.18 లక్షలు, రూ.20 లక్షల విలువైన పాత నోట్లను మార్చుకునే నిమిత్తం రామకృష్ణను కలిశారు. ఆ పాత నోట్లను యాభై శాతం కమిషన్ తో మార్చుకునేందుకు వారితో పాటు మరికొంత మంది కూడా రామకృష్ణను కలిశారని చెప్పారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు బంజారాహిల్స్ ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్, డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో దాడులు చేపట్టారు.

రామకృష్ణ కార్యాలయంలో ఉన్న వారందరినీ అదుపులోకి తీసుకున్నామని, వారి వద్ద నుంచి రూ.1.2 కోట్ల పాత కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే, ఈ దందాకు ప్రధాన సూత్రధారి అయిన రామకృష్ణ అప్పటికే పరారయ్యాడని, గాలింపు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ఈ కేసులో మొత్తం పది మంది వరకు పట్టుబడ్డారని బంజారాహిల్స్ ఏసీపీ మురళీ తెలిపారు.

More Telugu News