: రాష్ట్రపతి ఎన్నికపై బీజేపీ ముద్ర... ఐదు రాష్ట్రాల ఫలితాలతో నేరుగా గెలిపించుకునే అవకాశం!

రాష్ట్రపతి అభ్యర్థిని సొంతంగా నిలబెట్టి, గెలిపించుకోవాలనేది ఎప్పటి నుంచో బీజేపీ కల. ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో అది ఇప్పుడు నెరవేరనుంది.  ఈ గెలుపు శాసనసభల్లో బలాబలాలను మార్చడంతో పాటు దేశరాజకీయాల్లో కూడా కీలక ప్రభావం చూపనుంది. ఈ ఏడాది జూలైలో ప్రణబ్‌ ముఖర్జీ పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో... జూన్‌లో రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. పార్లమెంటు ఉభయ సభల సభ్యులు, దేశంలోని అన్ని అసెంబ్లీల ఎమ్మెల్యేలు గల ఎలక్టరోల్ కాలేజ్ ద్వారా రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. వీరిలో ఒక్కో ఎంపీ ఓటు విలువ 708 ఓట్లు. ఇక, ఎమ్మెల్యే ఓటు విలువ ఆయా రాష్ట్రాల్లోని జనాభా ప్రాతిపదికను బట్టి ఉంటుంది. గరిష్టంగా యూపీ ఎమ్మెల్యే ఓటు విలువ 208 కాగా, కనిష్టంగా సిక్కిం ఓటు విలువ 8 మాత్రమే. రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టరోల్ కాలేజ్ మొత్తం ఓట్లు 10,98,882 ఉంటాయి.

ఇందులో సంగం ఓట్లు (సుమారు 5.49 లక్షల ఓట్లు) సాధించిన అభ్యర్థి విజయం సాధించవచ్చు. బీజేపీ ఇప్పటికే 282 లోక్ సభ సభ్యులను, 56 రాజ్యసభ సభ్యులను, 1126 మంది ఎమ్మెల్యేలను (తాజాగా ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో కాకుండా) కలిగివుంది. ఉత్తరప్రదేశ్ 325, ఉత్తరాఖండ్ 57, మణిపూర్ 21, గోవాలో 13 మంది ఎమ్మెల్యేలను బీజేపీ గెలుచుకుంది. ఈ ఐదు రాష్ట్రాల్లో ఉన్న మొత్తం ఓట్లు 1,03,756. తాజా ఫలితాలతో ఒక్క యూపీ నుంచే ఎన్డీయేకు 67,600 ఓట్లు వచ్చాయి. ఉత్తరాఖండ్‌ నుంచి 3648 ఓట్లు వచ్చాయి. ఇక, పంజాబ్‌, గోవా, మణిపూర్‌లలో బీజేపీకి వచ్చిన సీట్లను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఎవరి మద్దతు లేకుండానే నేరుగా తమ అభ్యర్థిని రాష్ట్రపతిగా గెలిపించుకునే అవకాశం బీజేపీకి దక్కింది.

More Telugu News