: అప్పుడు పూర్తిగా నిరాశలో కూరుకుపోయా.. రాజకీయాలను వదిలేద్దామనుకున్నా..!: కేటీఆర్

2008 ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఎదురుదెబ్బ తగిలిన తర్వాత పూర్తిగా నిరాశలో కూరుకుపోయామని టీఆర్ఎస్ నేత, మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆ దశలో కాంగ్రెస్ పార్టీలో విలీనం కాకతప్పదని అనిపించిందని, అదే జరిగితే రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావించానని గుర్తు చేసుకున్నారు. ప్రేమ్‌రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శరణం గచ్ఛామి’ చిత్రం ఆడియోను ఆదివారం హైదరాబాద్‌లో కేటీఆర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.

సినిమా ఓ వ్యాపారమని, తొలి రోజే డబ్బులన్నీ వచ్చేయాలన్న లెక్కలున్న ఈ రోజుల్లో ఇటువంటి కథను ఎంచుకోవడం సాహసమే అవుతుందన్నారు. ఉప ఎన్నికల తర్వాత నిరాశలో కూరుకుపోయిన తనకు ఓ పత్రికలో ప్రేమ్‌రాజ్ రాసిన వ్యాసం చదివాక కొత్త ఉత్సాహం వచ్చిందన్నారు. తర్వాత అతడిని కలుసుకుని మాట్లాడానని గుర్తు చేసుకున్నారు. ప్రేమ్‌రాజ్ తీసింది మూడు సినిమాలే అయినా రాశి కంటే వాసి ముఖ్యమని చాటారని పేర్కొన్నారు. ఈ చిత్రానికి ఎటువంటి సాయం కావాలన్నా అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. దర్శకుడు ప్రేమ్‌రాజ్ మాట్లాడుతూ బీఎండబ్ల్యూ కంటే ఇంట్లో బియ్యం ఉంటే చాలనుకునే వ్యక్తిని తానని అన్నారు. ఇదివరకు తీసిన రెండు చిత్రాలు కూడా సమాజం కోసమేనని తెలిపారు.

More Telugu News