: షర్మిల అందుకే ఓడారు.. మణిపూర్ ఉక్కుమహిళ పరాజయంపై విశ్లేషకులు

సొంత ప్రజల హక్కుల కోసం 16 ఏళ్లపాటు నిరాహార దీక్ష చేసి.. అదే ప్రజల కోసం దీక్ష విరమించి ఎన్నికల్లో బరిలోకి దిగిన మణిపూర్ ఉక్కుమహిళ ఇరోం షర్మిల ఘోర ఓటమి చవిచూశారు. తనకు ఎదురైన పరాభవంతో కలత చెందిన ఆమె రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం(అఫ్సా) రద్దు కోసం షర్మిల ఏకంగా 16 ఏళ్లపాటు నిరాహార దీక్ష చేశారు. ఇటీవల దీక్ష విరమించి పీపుల్స్ రిసర్జన్స్ అండ్ జస్టిస్ అలయన్స్’ అనే పార్టీ స్థాపించి ఎన్నికల బరిలోకి దిగారు. ముఖ్యమంత్రి ఇబోబిసింగ్‌పై పోటీ చేశారు. ఆమె గెలుపు నల్లేరు మీద నడకేనని అందరూ భావించారు. అయితే అత్యంత దయనీయంగా కేవలం 90 ఓట్లు మాత్రమే రావడంతో ఆమె కలత చెందారు.

ఎన్నికల్లో షర్మిల ఓటమికి బోలెడన్ని కారణాలు ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. సాయుధ బలగాల చట్ట విరుద్ధ హత్యలు, అత్యాచారాల కంటే రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి లేమి పెద్ద సమస్యగా మారింది. ‘అఫ్సా’ రద్దు కంటే ప్రజలు వీటికే అధిక ప్రాధాన్యం ఇచ్చారు. అంతేకాదు, 16 ఏళ్ల క్రితం షర్మిల దీక్ష ప్రారంభించినప్పటి పరిస్థితులు ప్రస్తుతం లేవు. దీనికి తోడు అత్యంత శక్తిమంతుడైన ఇబోబి సింగ్‌పై పోటీకి దిగడం, ఎన్నికలు జాతి ప్రయోజనాల ప్రాతిపదికగా జరగడం వల్లే షర్మిల ఓటమి పాలయ్యారని చెబుతున్నారు.

అంతేకాదు, తొలుత షర్మిల థౌబాల్ నియోజకవర్గంతోపాటు తన స్వస్థలమైన ఖురాయ్ నుంచి కూడా పోటీ చేస్తానని ప్రకటించారు. అయితే తర్వాత ఖురాయ్ నుంచి తప్పుకున్నారు. ఆమె ఓటమికి ఇది కూడా ఓ కారణమని చెబుతున్నారు. వీటన్నింటికీ మించి షర్మిల మహిళ కావడం కూడా ఆమె పరాజయానికి కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే, రాజకీయాలు పూర్తిగా పురుషుల సొంతమనే భావన మణిపూర్ ప్రజల్లో గూడుకట్టుకున్న అభిప్రాయం. తాజా ఎన్నికల్లో 268 మంది అభ్యర్థులు పోటీ పడితే వారిలో కేవలం పదిమంది మాత్రమే మహిళలు ఉండడం గమనార్హం.

More Telugu News