: ప్రధానిపైనే పోటీ చేసి సంచలనం సృష్టించిన భూమా!

కర్నూలు జిల్లా నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిది రాజకీయాల్లో విలక్షణ శైలి. ముక్కుసూటి రాజకీయాలకు పెట్టింది పేరు. ఆళ్లగడ్డకు చెందిన భూమా టీడీపీలో ఓ వెలుగు వెలిగారు. మూడుసార్లు ఎంపీగా గెలిచి హ్యాట్రిక్ పార్లమెంటేరియన్‌గా రికార్డు సృష్టించారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచిన ఆయన ఇటీవల సొంతగూడుకు చేరుకున్నారు. సోదరుడు భూమా వీర శేఖరరెడ్డి మరణంతో 1992లో జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించి తొలిసారి నాగిరెడ్డి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అనంతరం 1994లో జరిగిన సాధారణ ఎన్నికల్లోనూ ఆయన ఆళ్లగడ్డ నుంచి విజయం సాధించారు.

ఇక అప్పటి ప్రధాని పీవీ నరసింహారావుపైనే పోటీకి దిగిన భూమా రాజకీయాల్లో పెను సంచలనానికి కారణమయ్యారు. 1991లో దేశ ప్రధాని హోదాలో పీవీ నరసింహారావు నంద్యాల ఎంపీ స్థానం నుంచి పోటీకి దిగారు. దీంతో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఆయనపై అభ్యర్థిని నిలబెట్టలేదు. ఏకపక్షంగా జరిగిన పోలింగ్‌లో పీవీ 5.80 లక్షల రికార్డు మెజారిటీ విజయం సాధించారు.

1996లో మరోసారి ప్రధాని హోదాలోనే ఆయన బరిలోకి దిగారు. ఈసారి ఆయనపై పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఉన్న భూమాను తీసుకొచ్చిన టీడీపీ అధిష్ఠానం పీవీపై పోటీకి నిలిపి సంచలనం సృష్టించింది. ప్రధానిపై పోటీ చేసిన అతి చిన్న వయస్కుడిగా భూమా అప్పట్లో సంచలనం సృష్టించారు. అంతేకాదు అంతకుముందు ఎన్నికల్లో 5.80 లక్షల పైచిలుకు ఓట్లతో విజయం సాధించిన పీవీ మెజారిటీ ఈసారి వేలల్లోకి పడిపోయేలా చేశారు. ఆ ఎన్నికల్లో భూమా ఓడినా పీవీ మెజారిటీని 98,530 ఓట్లకు తగ్గించారు.
 

More Telugu News