: ప్రతిపక్షాలకు 2019 ఎన్నికల్లోనూ ఏమీ దక్కదు...!: యోగి ఆదిత్యనాథ్

భారతీయ జనతా పార్టీకి చెక్ పెట్టి, ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రతిపక్షాలకు ప్రత్యామ్నాయ అజెండా అవసరం ఉందంటూ నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఒమర్ అబ్దుల్లా చేసిన వరుస ట్వీట్లపై  బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ప్రతిపక్షం 2019ని మర్చిపోయి 2024 నాటి ఎన్నికలకు ప్రణాళిక వేసుకోవాల్సిందేనని ఆయన సూచించారు. అమిత్ షా వ్యూహాలు, కేంద్రం విధానాల వల్లే యూపీలో ఈ విజయం సాధ్యమైందన్నారు. ఫలితంగా స్వాతంత్ర్యానంతరం మోదీ అత్యంత శక్తిమంతమైన నేతగా అవతరించారని ఆదిత్యనాథ్ చెప్పారు.

ఈవీఎం మెషిన్లలో ఓటు ఎవరికి వేసినా అది బీజేపీకే వెళ్లేట్లు కేంద్రం అక్రమాలకు పాల్పడిందని, ఈ ఎన్నికలను రద్దు చేసి బ్యాలెట్ విధానంలో నిర్వహించాలన్న బీఎస్పీ అధినేత్రి మాయావతి వ్యాఖ్యలపైనా ఆదిత్యనాథ్ స్పందించారు. మాయావతి వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. యూపీలో సమాజ్ వాదీ పార్టీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగాయని, ఈవీఎంలో తప్పిదం జరిగితే ఫలితాలు ఎస్పీకి అనుకూలంగానే ఉండేవి కదా? అని ఆయన ప్రశ్నించారు. 

More Telugu News