: మంత్రి కావాలన్న కల తీరకుండానే వెళ్లిపోయిన భూమా నాగిరెడ్డి!

కర్నూలు జిల్లా రాజకీయాల్లో భూమా నాగిరెడ్డి మూడు దశాబ్దాలుగా పోషించిన పాత్ర బలమైనది. మూడు సార్లు నంధ్యాల ఎంపీగా, ఆ తర్వాత నంధ్యాల ఎమ్మెల్యేగా ఎన్నికైన భూమా మంత్రి పదవి సొంతం చేసుకోవాలని ఎంతో ఆశ పెట్టుకున్నారు. ఒక విధంగా ఆయన టీడీపీలో చేరిక వెనుక ఉన్న కారణాల్లో ఇదీ ఒకటని చెబుతారు. కుమార్తె, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియతో కలసి ఆయన గతేడాది టీడీపీలో చేరిపోగా... అప్పట్లోనే భూమాకు మంత్రి పదవి ఖాయమన్న ఊహాగానాలు వినిపించాయి. ఈ విషయంలో సీఎం చంద్రబాబు నుంచి హామీ కూడా తీసుకున్నారనే ప్రచారంం నడిచింది. అప్పటి నుంచీ మంత్రిగా అవకాశం పొందే విషయంలో ఆయన తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు.

చివరికి తాను గుండెపోటుతో మరణించడానికి ఒక్క రోజు ముందు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలతో కలసి భూమా సీఎం చంద్రబాబును కలిశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు, మంత్రి పదవి విషయాన్ని ఈ సందర్భంగా చర్చించినట్టు సమాచారం. మంత్రి వర్గ విస్తరణలో తనకు మంత్రి పదవి ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా కోరారని తెలుస్తోంది. తనకు కాకపోయినా తన కమార్తె అఖిలప్రియకు అయినా అవకాశం ఇవ్వాలనే ప్రతిపాదన తెచ్చినట్టు సమాచారం. కానీ, చివరికి మంత్రి పదవి కోరిక తీరకుండానే ఆయన అభిమానులు, పార్టీ వర్గాలను విడిచి వెళ్లారు.

More Telugu News