: బాలీవుడ్ సినిమా పాటను పాకిస్థాన్ స్కూల్ లో ప్రార్థనాగీతంగా పాడుతున్నారు!

బాలీవుడ్‌ సినిమా పాటను పాకిస్థాన్ లోని ఓ పాఠశాలలో ప్రార్థనా గీతంగా పాడిస్తున్నారు. 1957లో రిలీజ్ అయిన ‘దో ఆంఖే బారహ్‌ హాథ్‌’ సినిమాలో లతా మంగేష్కర్‌ పాడిన  ‘యే మాలిక్‌ తేరే బందే హమ్‌' పాట అప్పటి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. ఈ పాట పాకిస్థాన్‌ లో కూడా విశేషమైన ప్రాచుర్యం పొందింది. ఈ పాటలోని భావం నచ్చి పాకిస్థాన్‌ లోని ఓ పాఠశాల నిర్వాహకులు ఆ పాటను తమ పాఠశాల గీతంగా స్వీకరించారు. దీంతో అప్పటి నుంచి ఆ స్కూల్ లో ప్రార్థనా గీతంగా ఈ పాటను పాడుతున్నారు. దీనిపై లతా మంగేష్కర్ హర్షం వ్యక్తం చేశారు.

తాను పాడిన పాటను స్కూల్ ప్రార్థనాగీతంగా ఆలపించడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని ఆమె అన్నారు. కాగా ‘దో ఆంఖే బారహ్‌ హాథ్‌’ సినిమా ప్రతిష్ఠాత్మక గోల్డెన్‌ గ్లోబ్‌ పురస్కారం అందుకున్న తొలి భారతీయ సినిమాగా నిలవడం విశేషం. అంతే కాకుండా బెర్లిన్‌ అంతర్జాతీయ చిత్రోత్సవంలో సిల్వర్‌ బేర్‌ పురస్కారం కూడా అందుకుని సత్తా చాటింది. జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రం, ఉత్తమ ప్రాంతీయ చిత్రం (హిందీ) పురస్కారాలను కూడా దక్కించుకుది. ఈ పురస్కారాలు ఆ సినిమాను, ఆ సినిమాలోని ఈ పాట ప్రాముఖ్యతను చాటి చెబుతున్నాయి.

More Telugu News