: తలాక్ నుంచి రక్షించండంటూ హైకోర్టును ఆశ్రయించిన ముస్లిం తోడికోడళ్లు!

అమెరికా నుంచి వాట్స్ యాప్ లో మూడుసార్లు తలాక్ చెప్పడం ద్వారా విడాకులు తీసుకున్నామనడంతో షాక్ తిన్న తోడికోడళ్లిద్దరూ ఒక్కటయ్యారు. తమకు జరిగిన అన్యాయంపై పోరాడాలని నిర్ణయించుకున్నారు. దీంతో హైదరాబాద్‌ పాతబస్తీ ‘అలీ జా కోట్ల’కు చెందిన తోడికోడళ్లు మెహరిన్‌ నూర్‌, సైదా హిన ఫాతిమాలు అక్రమ పద్ధతుల్లో చెప్పే ‘ట్రిపుల్‌ తలాక్‌’ బారి నుంచి ముస్లిం మహిళలకు రక్షణ కల్పించే మార్గదర్శకాలను రూపొందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని అభ్యర్థిస్తూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.

అమెరికాలో ఉంటున్న తమ భర్తలు వాట్సాప్‌ మెసేజ్‌ ద్వారా పంపిన ట్రిపుల్‌ తలాక్‌ కు చట్టబద్ధత లేదని, దాన్ని పరిగణనలోకి తీసుకొని విడాకుల పత్రం జారీచేయకుండా తెలంగాణ వక్ఫ్‌ బోర్డు, ఖాజీలను ఆదేశించాలని వారు ఈ వ్యాజ్యంలో కోరారు. అలాగే తమ ఇంటి నుంచి అత్తమామలు తమను ఖాళీ చేయించకుండా ఉండేలా తమకు పోలీసు భద్రత కల్పించాలని ఈ వ్యాజ్యంలో హైకోర్టును కోరారు. దీనిని విచారణకు స్వీకరించిన ఉమ్మడి హైకోర్టు... న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రామలింగేశ్వరరావు సారధ్యంలో విచారణకు ఆదేశించింది. కాగా, ఒస్మాన్‌ ఖురేషి, సయ్యద్‌ ఫయాజుద్దీన్‌ హఫీజ్‌ లు వాట్స్ యాప్ ద్వారా తలాక్ చెప్పడం సరికాదని ఖాజీలు చెబుతున్నప్పటికీ, ఒకసారి తలాక్ చెప్పేశారు కనుక విడాకులు అయిపోయినట్టేనని ప్రకటించిన సంగతి తెలిసిందే. 

More Telugu News