: బ్యాట్ కు, ప్యాడ్ కు కూడా బంతి తగల్లేదు...అవుట్ ఎందుకిచ్చారు?: అంపైర్ ను రివ్యూ అడిగిన బంగ్లా బ్యాట్స్ మన్

శ్రీలంక, బంగ్లాదేశ్ జట్ల మధ్య గాలేలో జరుగుతున్న టెస్ట్‌ మ్యాచ్ లో మరోసారి ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. తొలుత బౌలింగ్ చేసిన సందర్భంగా శ్రీలంక ఆటగాడు సిక్సర్ కొడితే, అది ఔట్ అనుకుని బౌలర్ సంబరాలు జరుపుకున్న సంగతి తెలిసిందే. తాజాగా అలాంటి ఘటనే మరోసారి చోటుచేసుకుని, స్టేడియంలోని ప్రేక్షకుల్లో నవ్వులు పూయించింది. ఘటన వివరాల్లోకి వెళ్తే... శ్రీలంక ఆటగాడు అసేల గుణరత్నే బంగ్లాదేశ్ ఓపెనర్ సౌమ్య సర్కార్ కు బంతిని సంధించగా, అది స్పిన్ అవుతుందని భావించిన సౌమ్య సర్కార్ దానిని షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు.

అయితే, అది ఎలాంటి మలుపులు తిరగకుండా నేరుగా వెళ్లి ఆఫ్ స్టంప్ ను ముద్దాడి, బెయిల్ ను గిరాటేసింది. అలా క్లీన్ బౌల్డ్ కావడంతో, అంపైర్ 'ఔట్' అంటూ సిగ్నల్ చూపించారు. అయితే తాను క్లీన్ బౌల్డ్ అవడాన్ని గమనించని సౌమ్య సర్కార్... అయోమయంగా చూస్తూ, బాల్ ప్యాడ్‌ కి తగల్లేదు, కనీసం బ్యాట్‌ ని తాకలేదు, ఎందుకు ఔట్ ఇచ్చారు? అన్నట్టుగా ఎక్స్ ప్రెషన్ ఇచ్చి, అంపైర్ ను రివ్యూ అడిగాడు.

దీంతో అందరూ పెద్దగా నవ్వేయడంతో.. తాను 'క్లీన్ బౌల్డ్' అయిన అసలు విషయాన్ని గమనించిన సౌమ్య తను కూడా చిన్నగా నవ్వుకుంటూ పెవిలియన్ బాటపట్టాడు. దీంతో స్టేడియంలో కూడా నవ్వులు పూశాయి. కాగా, సౌమ్య సర్కార్ 53 పరుగులు చేయడం విశేషం.

More Telugu News