: ‘పది’ విద్యార్థులకు ఉపశమనం.. పరీక్షల ప్రారంభం రోజు 5 నిమిషాల లేట్ ఓకే!

‘ఒక్క నిమిషం’ నిబంధనతో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం కొంత ఉపశమనం కలిగించే ప్రకటన చేసింది. త్వరలో జరగనున్న పదో తరగతి పరీక్షల్లో తొలి రోజు నిర్ణీత సమయం కన్నా ఐదు నిమిషాలు లేటుగా వచ్చినా అనుమతించనున్నట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఆర్.సురేందర్‌రెడ్డి తెలిపారు. ఆ తర్వాతి రోజు నుంచి మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమని, ఈ విషయాన్ని విద్యార్థులు గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ఈనెల 14 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం  కానున్న నేపథ్యంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,38,226 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని, వారి కోసం 2556 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేసినట్టు తెలిపారు.  ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 గంటలకు వరకు పరీక్ష ఉంటుందని, విద్యార్థులను 8.45 గంటలకే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామన్నారు. అలాగే తొలిరోజు ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతిస్తామని, అయితే అది తొలి రోజుకు మాత్రమే పరిమితమని పేర్కొన్నారు.

హాల్‌టికెట్లను ఇప్పటికే ఆయా స్కూళ్లకు పంపించామని, అందని, పోగొట్టుకున్న విద్యార్థులు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. అయితే డౌన్‌లోడ్ చేసుకున్న హాల్ టికెట్లపై ప్రధానోపాధ్యాయుడు లేదంటే గెజిటెడ్ అధికారి సంతకం తప్పనిసరి అని తెలిపారు. విద్యార్థులు సివిల్ డ్రెస్‌లోనే పరీక్ష కేంద్రానికి రావాలని, సెల్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను లోనికి అనుమతించబోమని పేర్కొన్నారు. అలాగే హాల్‌టికెట్ చూపించి బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. కాగా ఈ ఏడాది పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థుల్లో ఇంగ్లిష్ మీడియం విద్యార్థుల సంఖ్య 2,96,251 కాగా, తెలుగు మీడియం విద్యార్థుల సంఖ్య 2,01,262 మాత్రమే కావడం గమనార్హం.

More Telugu News