: కొడితే కొట్టాలిరా సిక్సు కొట్టాలి.. పారిన సిద్ధూ ప్లాన్!

మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ చివరకు తాను అనుకున్నది సాధించారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అమృత్ సర్ (తూర్పు) నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగిన సిద్ధూ విజయదుందుభి మోగించారు. ఆచితూచి సిక్స్ కొట్టినట్టుగా కొట్టాడు. అసలు ఆయన కాంగ్రెస్ పార్టీలోకి రావడమే ఎన్నో మలుపుల మధ్య జరిగింది.

బీజేపీ నుంచి బయటకు వచ్చిన సిద్ధూ ఏ పార్టీలో చేరుతారో అనే విషయంపై ఎన్నికల ముందు పెద్ద చర్చే నడిచింది. ఆమ్ ఆద్మీ పార్టీలో చేరేందుకు తొలుత ఆయన మొగ్గు చూపారు. కానీ, ఆ ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో, 'అవాజ్-ఎ-పంజాబ్' పేరిట సొంత పార్టీని స్థాపించారాయన. అయితే, ఎన్నికలకు సమయం చాలా తక్కువగా ఉండటంతో, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడం చాలా కష్టమనే అంచనాకు ఆయన వచ్చారు. మరోవైపు, అధికారంలో ఉన్న అకాలీదళ్-బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్న విషయాన్ని సిద్ధూ గ్రహించారు. దీంతో, చాలా తెలివిగా కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపారు.

సిద్ధూను కాంగ్రెస్ పార్టీ కూడా సాదరంగా పార్టీలోకి ఆహ్వానించింది. సిద్ధూకు ఉన్న ప్రజాకర్షణ తమకు ఉపయోగపడుతుందని కాంగ్రెస్ పార్టీ భావించింది. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ తరపున ఆయన ఘన విజయం సాధించారు. ఇప్పుడు పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుండటంతో... ఆయనకు కీలక పదవి దక్కబోతోంది. డిప్యూటీ సీఎం పదవిని ఆయనకు ఇవ్వొచ్చని తెలుస్తోంది. ఇదే నిజమైతే సిద్ధూ జాక్ పాట్ కొట్టినట్టే.

More Telugu News