: సీఎం కావాలనుకుంది.. చివరకు ఎమ్మెల్యే కూడా కాలేకపోయింది!

యూపీ ఎన్నికలకు ముందు సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ కుటుంబంలో చోటు చేసుకున్న పరిణామాలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. సస్పెన్స్ సీరియల్ ను తలపించేలా ప్రతి రోజూ ఎన్నో మలుపులు తీసుకుంది ములాయం కుటుంబ రాజకీయం. ఆ సమయంలో బాగా పాప్యులర్ అయిన పేరు అపర్ణా యాదవ్. ములాయం రెండో కుమారుడు ప్రతీక్ యాదవ్ భార్య అపర్ణ. విద్యావంతురాలైన అపర్ణకు రాజకీయాల పట్ల అమితమైన ఆసక్తి ఉంది. ప్రత్యక్ష రాజకీయాల్లో లేనప్పటికీ, తెరవెనుక నుంచి ఆమె రాజకీయ కార్యక్రమాల్లో అప్పుడప్పుడు పాల్గొనేవారు. ములాయంకు, అఖిలేష్ కు మధ్య విభేదాలు తలెత్తడానికి కూడా అపర్ణే కారణమని అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యంతో అపర్ణ పావులు కదుపుతున్నారంటూ వార్తలు వెల్లువెత్తాయి. నేషనల్ మీడియాలో ఆమె పేరు మారుమోగింది.

అయితే, 'తాను ఒకటి తలిస్తే దేవుడు మరొకటి తలుస్తాడు' అనే సామెత అపర్ణ విషయంలో నిజమయింది. ముఖ్యమంత్రి కావాలని కలలుగన్న ఆమె... చివరకు ఎమ్మెల్యేగా కూడా గెలుపొందలేక పోయారు. లక్నో కంటోన్మెంట్ నియోజకర్గంలో బీజేపీ అభ్యర్థి రీటా బహుగుణ జోషిపై పోటీ చేసిన ఆమె పరాజయాన్ని మూటగట్టుకున్నారు. అఖిలేష్ భార్య డింపుల్ కూడా అపర్ణ విజయం కోసం ప్రత్యేకంగా ప్రచారం నిర్వహించారు. అయినా ఫలితం దక్కలేదు. 

More Telugu News