: ఇది నరేంద్ర మోదీ ఘనతా? రాష్ట్ర ప్రభుత్వాల తప్పిదాలా?.. ఎన్నికల ఫలితాలకు కారణాలు ఏమిటి?

ప్రస్తుతం వెల్లడవుతున్న ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయ విశ్లేషకుల్లో సరికొత్త ఆలోచనలను రేపుతున్నాయి. ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రాభవం కన్నా, స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన తప్పిదాలు ఈ ఎన్నికల్లో ప్రధాన భూమికను పోషించినట్టు స్పష్టమవుతోంది. ఉత్తరప్రదేశ్ లో పెరిగిన హింసాకాండలు, అసహనం, గత రెండు మూడేళ్లలో జరిగిన నేరాలు వంటివి ఓటర్లను బీజేపీ వైపు ఆకర్షితులను చేశాయి. దీంతో ముఖ్యమంత్రిగా ఉన్న అఖిలేష్ యాదవ్ గద్దె దిగక తప్పనిసరి పరిస్థితి నెలకొంది. ఓ రకంగా యూపీలో గెలుపు బీజేపీకి సరికొత్త ఔషధమే.

సరిగ్గా పంజాబ్ లో సైతం ఇదే జరిగింది. అధికారంలో ఉన్న అకాలీదళ్, బీజేపీ కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. మాదకద్రవ్యాల వ్యాపారాన్ని అరికట్టలేకపోయిన అకాలీ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని వెల్లడైంది. ఇక గోవా కూడా ఇందుకు ఏ మాత్రం తీసిపోలేదు. అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి తిరిగి గెలుస్తుందని చేసిన ఊహాగానాలు పటాపంచలయ్యేలా ఉన్నాయి. ఇక్కడ బీజేపీ ముఖ్యమంత్రి కూడా ఓడిపోవడం గమనార్హం. ఇక్కడ కాంగ్రెస్ స్వల్ప ఆధిక్యంలో ఉంది. ఉత్తరాఖండ్ లో సైతం అధికార కాంగ్రెస్ స్వీయ తప్పిదాలు ఆ పార్టీకి చేటు తెచ్చాయి. ఇక్కడ బీజేపీ అధికారాన్ని ఖాయం చేసుకుంది. ఎటొచ్చీ మణిపూర్ లో మాత్రం గట్టి పోటీ కొనసాగుతుండగా, బీజేపీ స్వల్ప ఆధిక్యంలో ఉంది. మొత్తం మీద మోదీ చరిష్మా కన్నా, రాష్ట్ర రాజకీయాలు, ఆయా ప్రాంత పరిస్థితులే ప్రభావం చూపినట్టు స్పష్టమవుతోంది.

More Telugu News