: ఓటుకు నోటు కేసు నిందితుడు సెబాస్టియన్ మరో ఘనకార్యం.. నకిలీ పత్రాలతో అద్దె ఇంటిని కాజేసే యత్నం

ఓటుకు నోటు కేసు  నిందితుడు సెబాస్టియన్‌కు సంబంధించిన మరో ఘనకార్యం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లోని తానుంటున్న ఇంటికి పదేళ్లుగా అద్దె చెల్లించకపోవడమే కాకుండా నకిలీ పత్రాలు సృష్టించి దానిని కాజేసేందుకు ప్రయత్నించాడు. ఎస్ఆర్ నగర్ పోలీసుల కథనం ప్రకారం.. సెబాస్టియన్ 2003లో మోతీనగర్‌ డివిజన్‌లోని వికాస్‌పురి కాలనీలో ఫిలిప్స్ అనే వ్యక్తి ఇంట్లో అద్దెకు దిగాడు. పదేళ్లుగా అద్దె చెల్లించకపోవడమే కాకుండా అడిగితే ఫిలిప్స్‌తోపాటు కుటుంబ సభ్యులను వేధించడం మొదలుపెట్టాడు. అంతేకాదు నకిలీ పత్రాలతో ఇంటిని కాజేసే ప్రయత్నం చేశాడు. అద్దె విషయంలో ఇరువురి మధ్య పలుమార్లు ఘర్షణలు కూడా జరిగాయి.

దీంతో పోలీస్ స్టేషన్‌కు కూడా వెళ్లారు. ఇల్లు ఖాళీ చేయాలని ఫిలిప్స్ డిమాండ్ చేయడంతో సెబాస్టియన్ కోర్టుకెళ్లి స్టే తెచ్చుకున్నాడు. స్టేపై ఫిలిప్స్ అప్పీలుకు వెళ్లాడు. దీంతో సెబాస్టియన్ గత నెల 10న ఇల్లు ఖాళీ చేశాడు. అయితే ఇల్లు ఖాళీ చేసినా సెబాస్టియన్, కుమారుడు అభిషేక్, అతడి అనుచరుల నుంచి మాత్రం వేధింపులు ఆగలేదు. రోజూ అర్ధరాత్రి తాగి వచ్చి భయాందోళనలకు గురిచేస్తుండడంతో ఫిలిప్స్ కుటుంబ సభ్యులు గురువారం రాత్రి ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News