: మోదీ శక్తికి తిరుగులేదా? నోట్ల రద్దును ప్రజలు ఆమోదించారా?... నేడు తేలిపోతుంది!

నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెల్లడి కానున్నాయి. ఇండియాలోని అతిపెద్ద రాష్ట్రాల్లో ఒకటైన ఉత్తరప్రదేశ్ తో పాటు కీలకమైన పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ లలో ఈ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలు కానుండగా, మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాల సరళి తెలిసిపోతుందని అంచనా. ఇక ఈ ఎన్నికల ద్వారా బీజేపీని మరిన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి తేవాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నీ తానై పర్యటనలు జరిపారు. మిగతా రాష్ట్రాల మాట ఎలా ఉన్నా, ఒక్క ఉత్తరప్రదేశ్ లో బీజేపీ అధికారంలోకి వస్తే చాలు. మోదీ శక్తికి తిరుగులేదని నిరూపితమవుతుందని, ప్రజలు ఆయన వెంటే ఉన్నారని వెల్లడైనట్లని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

 ఇదే సమయంలో గత సంవత్సరం ఆయన తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయానికి ప్రజలు ఆమోదం పలికినట్టుగా బీజేపీ విజయంతో నిరూపితమైనట్టేనని చెబుతున్నారు. రాజ్యసభలో పూర్తి మెజారిటీని సాధించి, జూలైలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు ఉత్తరప్రదేశ్ లో సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాల్లో బీజేపీ గెలవక తప్పనిసరి పరిస్థితి నెలకొంది.

కాగా, ఉత్తరప్రదేశ్‌ లోని 403, పంజాబ్‌ లోని 117, ఉత్తరాఖండ్‌ లోని 71, మణిపూర్‌ లోని 60, గోవాలోని 40 సీట్లకు ఫలితాలు నేడు విడుదలవుతాయి. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేసిన అధికారులు, ఓట్ల లెక్కింపును వీడియో తీసి నిక్షిప్తం చేయనున్నారు. కౌంటింగ్ కేంద్రాలను ఇప్పటికే సాయుధ బలగాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి. అభ్యర్థులు, వారి తరఫున నియమితులైన ఏజంట్లు మినహా మరెవరినీ లెక్కింపు కేంద్రాల వద్దకు రానివ్వబోమని పోలీసులు స్పష్టం చేశారు.

More Telugu News