: 'సీత' షార్ట్ ఫిలిం టైటిల్ పై రగడ.. స్పందించిన నాయిక దీప్తీ సునయన!

'సీత-ఐ యామ్ నాట్ ఎ వర్జిన్' అనే షార్ట్ ఫిల్మ్ పెను వివాదం రేగుతోంది. షార్ట్ ఫిల్మ్ పేరు మార్చాలని డిమాండ్ చేస్తూ కేసు నమోదు కావడంపై ఈ షార్ట్ ఫిల్మ్ లో ప్రధాన పాత్ర సీత పాత్రధారి, సోషల్ మీడియా డబ్ స్మాష్ స్టార్ దీప్తీ సునయన స్పందించింది. దీనిపై ఆమె మాట్లాడుతూ, టైటిల్ ను చూసి కథ ఏంటో డిసైడ్ చేస్తామంటే ఎలా? అని ప్రశ్నించింది. వాస్తవానికి ఈ చిత్రకథకు, పురాణాల్లో సీతాదేవికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.

అసలు టైటిల్ లేదా ట్యాగ్ లైన్ బాగుంటే.. కథలో సీతాదేవిని తప్పుగా చూపించినా పర్లేదా? అని ఆమె తిరిగి ప్రశ్నించింది. టైటిల్ ను చూసి నిర్ణయానికి రావడం తొందరపాటు అని పేర్కొంది. ఈ షార్ట్ ఫిల్మ్ లో సీత పాత్ర పోషించిన తాను మహిళను కాదా? తనకు సీతమ్మవారి గురించి తెలియదా? అని ప్రశ్నించింది. తాను కూడా హిందువునేనని పేర్కొంది. ఇందులో హిందువుల మనోభావాలు దెబ్బతీసే అంశాలు ఏవీ లేవని తెలిపింది.

సీత అనే అమ్మాయి జీవితంలో చోటుచేసుకున్న అంశాల గురించి ఈ షార్ట్ ఫిలిం చెబుతుందని దీప్తి సునయన స్పష్టం చేసింది. కాగా, ఈ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ కౌషిక్ బాబు మాట్లాడుతూ, టైటిల్ ను మార్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశాడు. 

More Telugu News