: తెలంగాణ.. భేష్.. దూసుకుపోతోంది!: అసెంబ్లీలో గవర్నర్

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఈ సందర్భంగా గవర్నర్ వివరించారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అతి తక్కువ సమయంలోనే అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని గవర్నర్ తెలిపారు. మిషన్ బగీరథ, మిషన్ కాకతీయ, హరితహారం కార్యక్రమాలను తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిందని చెప్పారు. రహదారుల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన 9 నెలల కాలంలోనే ఎలాంటి కరెంట్ కోతలు లేకుండా చేశామని వెల్లడించారు.

13.7 శాతం వృద్ధి రేటుతో తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోందని గవర్నర్ తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుతో కొత్తగా రూ. 54వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. ఐటీ రంగంలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉందని తెలిపారు. టీహబ్ సెకండ్ ఫేజ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.  

ఈ ఏడాది చివరికల్లా మిషన్ బగీరథ ద్వారా ప్రతి ఇంటికి తాగు నీటిని అందిస్తామని తెలిపారు. మిషన్ కాకతీయ ఫేజ్ 1, 2 కింద కోటి ఎకరాలకు సాగు నీరు ఇచ్చేందుకు ప్రాజెక్టులను నిర్మిస్తున్నామని చెప్పారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇప్పటి వరకు 5900 ఉద్యోగాలను, విద్యుత్ శాఖలో 2681, ఆర్టీసీలో 3950, పోలీస్ శాఖలో 10,422 ఉద్యోగాలు, సింగరేణిలో 4500 ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పారు. ఐదేళ్లలో లక్ష ఉద్యోగాలను కల్పిస్తామని వెల్లడించారు.

శాంతి భద్రతల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, మహిళల నిరోధానికి షీ టీమ్స్ ను ఏర్పాటు చేశామని గవర్నర్ తెలిపారు. పోలీసులకు కొత్తగా 4వేల వాహనాలను కేటాయించామని చెప్పారు. కేజీ టు పీజీ విద్యలో భాగంగా రెసిడెన్షియల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నామని... ఎస్సీ మహిళల  కోసం కొత్తగా 30 రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

వ్యవసాయ రంగానికి 9 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని గవర్నర్ చెప్పారు. పాలనను ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు కొత్తగా 21 జిల్లాలను ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. 2017-18 తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగించడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు.

More Telugu News