: ఈ భారత సంతతి యువతి లేఖను తప్పక చదవండి: బరాక్ ఒబామా

అమెరికా అధ్యక్షునిగా పదవీ విరమణ చేసిన తరువాత, సేదదీరేందుకు వెళ్లిపోయిన బరాక్ ఒబామా, ఆయన సతీమణి మిచెల్ తిరిగివచ్చే సమయానికి, ఓ భారత సంతతి యువతి రాసిన లేఖ ఒకటి వారి కోసం ఎదురు చూస్తుండగా, దాన్ని చదివిన ఒబామా, ప్రతి ఒక్కరూ దీన్ని తప్పక చదవాలని సూచించారు. సింధూ అనే ఓ యువతి, మిచెల్ ఒబామాను 'శక్తిమంతమైన స్ఫూర్తిదాయిని'గా అభివర్ణిస్తూ, రాసిన లేఖ ఇది.

"మిచెల్, నేను సెలవుల నుంచి వచ్చిన తరువాత సింధు అనే మహిళ రాసిన లేఖ మాకోసం ఎదురుచూస్తూ ఉంది. సింధూ కథ విని నేనెంతో స్ఫూర్తిని పొందాను. దీన్ని అందరితో షేర్ చేసుకోవాలని అనిపించింది" అని చెబుతూ, ఆ లేఖను 'మీడియం డాట్ కామ్'లో ఉంచారు. ఇక 'నేను వచ్చేశాను' అనే సబ్జెక్ట్ లైన్ తో ఉన్న లేఖలో, 1996లో తాను యూనివర్శిటీ ఆఫ్ చికాగోలో విద్యాభ్యాసం నిమిత్తం ప్రవేశించిన నాటి ఘటనతో సింధూ లేఖ ప్రారంభమైంది.

"1996లో ఒక రోజు. ఓ సమావేశంలో కూర్చున్న 17 ఏళ్ల భారత బాలిక, ఓ ఉపన్యాసానికి ఎంతో ముగ్ధురాలైంది. మాట్లాడుతున్నది ఎవరో కూడా ఆ బాలికకు తెలీదు. కానీ ఆమె మాటలను తను ఎన్నటికీ మరచిపోలేదు. నా జీవితంలో ఏదో సాధించాలన్న భావనను ఆమె ప్రసంగం కలిగించింది. ఇతరులకు సాయపడాలన్న ఆలోచనను పెంచింది" అంటూ చెప్పుకొచ్చింది. ఆమే మిచెల్ ఒబామా. తన భర్త క్రియాశీల రాజకీయాల్లోకి రావడానికి ఏడాది ముందు చికాగో వర్శిటీలో మిచెల్ ప్రసంగించింది. మిచెల్ ప్రసంగం ఇచ్చిన స్ఫూర్తితో తాను సామాజిక కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించుకున్నానని సింధూ వెల్లడించింది. అప్పట్లోనే ఓ ఆసుపత్రిలో వాలంటీరుగా చేరానని, స్కూలు తరువాత చిన్నారులకు మరింతగా అర్థం అయ్యేలా పాఠాలను బోధించేందుకు వినూత్న విద్యా బోధనా విధానాన్ని నేర్చుకున్నానని చెప్పుకొచ్చారు.

కాగా, ఇప్పుడు సింధూ వయసు 38 సంవత్సరాలు. వయసు కొంచెం పెరిగినట్టు కనిపించినా, తన మనసుకు మాత్రం వయసు పెరగలేదని నిరూపిస్తున్నారు. తన జీవితంలో ఎంతో మార్పునకు కారణమైన ఒబామా దంపతులను ఆమె గుర్తు చేసుకున్నారు. తాను కోరుకుంటున్న ప్రపంచం ఇది కాదని, తాను కోరే ప్రపంచం కోసం కృషి చేస్తానని, మీరు సెలవుల నుంచి వచ్చిన తరువాత, ఈ విషయాన్ని మీకు తెలిపేందుకే లేఖను రాస్తున్నానని సింధు పేర్కొన్నారు.

More Telugu News