: 'స్మార్ట్' యోచన... మీ ఇంటి రెంట్ ను చెల్లించనున్న మోదీ ప్రభుత్వం!

చిన్న వేతన జీవులకు, నగరాలు, పట్టణాల్లో నివసిస్తూ, సొంత ఇల్లు లేక, అద్దె బాధలు భరించలేని స్థితిలో ఇబ్బందులు పడుతున్న పేదలకు నరేంద్ర మోదీ సర్కారు శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 100 స్మార్ట్ నగరాల్లో నివసిస్తున్న ప్రజలు తమ గృహావసరాల కోసం వెచ్చిస్తున్న డబ్బును వోచర్ల రూపంలో తిరిగి ఇవ్వాలని నిర్ణయం తీసుకోనుంది. ఇందుకోసం రూ. 2,700 కోట్లతో మరో సంక్షేమ పథకాన్ని అమలు చేయాలని, కొత్త రెంటల్ హౌసింగ్ పాలసీని తేవాలని భావిస్తోంది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు వచ్చే మూడేళ్లపాటు ఈ స్కీమును అమలు చేయాలని భావిస్తున్న మోదీ సర్కారు, 2017-18 ఆర్థిక సంవత్సరం నుంచి దీన్ని అమలు చేయనున్నట్టు తెలుస్తోంది. స్మార్ట్ నగరాల్లో స్కీమ్ అమలుకు ఏటా రూ. 2,713 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్న కేంద్రం, దీని ద్వారా పట్టణ పేదలు, వలస వచ్చే ప్రజలకు ప్రత్యక్షంగా లబ్ది కలుగుతుందని పేర్కొంది.

కాగా, ఈ స్కీములో భాగంగా, ప్రభుత్వం అందించే ఓచర్లను అద్దెదారులు, తమ యజమానికి ఇవ్వాల్సివుంటుంది. సదరు యజమాని ఈ ఓచర్లను ఏ పౌర సేవా కేంద్రంలోనైనా మార్చుకోవచ్చు. ఓచర్ విలువ కన్నా అద్దె ఎక్కువగా ఉన్న పక్షంలో అదనపు మొత్తాన్ని లబ్దిదారే చెల్లించుకోవాల్సి వుంటుంది. అద్దె ఎంత ఉంటుందన్న విషయాన్ని స్థానిక పరిస్థితి, ఆర్థిక స్థితి, స్థానిక సంస్థల నుంచి అందే నివేదిక, మార్కెట్ విలువ తదితరాల ఆధారంగా నిర్ణయిస్తారు. ఇక వోచర్ల స్థానంలో దాని విలువను లబ్దిదారు ఖాతాలో వేసే ఆప్షన్ కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం.

కాగా, 2011 జనాభా లెక్కల ప్రకారం, పట్టణ ప్రాంతాల్లో 27.5 శాతం మంది అద్దె ఇళ్లల్లో నివసిస్తున్నారు. ఇదే సమయంలో నేషనల్ శాంపిల్ సర్వే వెల్లడించిన వివరాల ప్రకారం, 35 శాతం మంది అద్దె ఇళ్లల్లో ఉంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తలపెట్టిన 'హౌసింగ్ స్కీమ్ ఫర్ ఆల్' కార్యక్రమంలో భాగంగా ఈ స్కీముకు రూపకల్పన చేసినట్టు పట్టణ పేదరిక నిర్మూలన మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు. గృహాల కొరతను నిరోధించేందుకు, నిర్మాణ రంగంలో అందుబాటు ధరల్లో గృహాల లభ్యతను పెంచేందుకు బినామీ ఆస్తులు, నిర్మాణాలపై కఠిన చర్యలు సైతం తీసుకోనున్నట్టు తెలిపారు.

More Telugu News