: యుద్ధనౌక 'సంధ్యాయక్'లో బాహాబాహీ... కొట్టుకుంటున్న సెయిలర్లను అదుపు చేసేందుకు హెలికాప్టర్లలో జవాన్లు

బంగాళాఖాతంలో విధులు నిర్వహిస్తున్న ఐఎన్ఎస్ సంధ్యాయక్ నౌకలో నలుగురు నావికులు, తమ ఉన్నతాధికారిపై చెయ్యి చేసుకోవడం, ఆపై నౌకలో బాహాబాహీ జరగడంతో, వారిని అదుపు చేసేందుకు తీరం నుంచి హెలికాప్టర్లలో జవాన్లను రంగంలోకి దించాల్సి వచ్చింది. అధికారి ఆదేశాలు పాటించకుండా అతన్ని ఓ సెయిలర్ కొట్టడంతో, ఇదే అదనుగా, సదరు అధికారిపై కోపంతో ఉన్న మిగతా సెయిలర్లు దాడికి దిగారు. ఒడిశా తీర ప్రాంతంలోని పారాదీప్ సమీపంలో ఈ ఘటన జరిగిందని, ఉన్నతాధికారులపై గౌరవం చూపలేదన్న కారణంతో నలుగురు సెయిలర్లను విధుల నుంచి తొలగించామని అధికారులు తెలిపారు.

సముద్ర సర్వే షిప్ గా, తీర ప్రాంత రక్షక విధుల్లోనూ భాగం పంచుకునే ఈ నౌకలో, గొడవ పెద్దది కాకుండా చూసేందుకు భద్రతా దళాలను హుటాహుటిన పిలిపించాల్సి వచ్చింది. భారత సాయుధ దళాలు అత్యంత క్రమశిక్షణా నియమావళిని పాటిస్తుంటాయని, ఈ తరహా ఘటనలను క్షమించబోమని భారత నౌకాదళం అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరుగుతుందని అన్నారు. ఈ ఘటన తరువాత సంధ్యాయక్, తిరిగి తన విధుల్లో నిమగ్నమైందని అన్నారు.

More Telugu News