: అధికార నివాసాన్ని ఖాళీ చేసిన పన్నీర్ సెల్వం.. జయ ఇంటి సమీపంలో కొత్త ఇంటికి మకాం!

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్ సెల్వం తన అధికార నివాస గృహాన్ని ఖాళీ చేశారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివసించిన పోయెస్‌గార్డెన్ సమీపంలోని వీనస్ కాలనీలోని కొత్త ఇంటిలోకి గురువారం కుటుంబ సమేతంగా గృహ ప్రవేశం చేశారు. 2011లో ఆర్థిక మంత్రిగా పన్నీర్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అడయార్ గ్రీన్ వేస్ రోడ్డులోని మంత్రులు బసచేసే ప్రభుత్వ బంగళాలోనే ఉంటున్నారు. శశికళపై తిరుగుబాటు చేసిన తర్వాత ఆయన నివాసానికి అభిమానులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పోటెత్తడంతో ఆ ప్రాంతం సందడిగా మారింది.

పళని ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అధికారిక బంగళాను ఖాళీ చేయాలంటూ పన్నీర్‌పై ఒత్తిడి పెరిగింది. బంగళాను ఖాళీ చేయాలంటూ ఇటీవల ప్రజాపనుల శాఖ కార్యదర్శి ప్రభాకర్ నోటీసులు జారీ చేశారు. నిజానికి మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రి వంటి వారికి  ప్రభుత్వ నివాసాన్ని ఖాళీ చేసేందుకు ఆరు నెలల సమయం ఇస్తారు. అటువంటిదేమీ లేకుండానే ఈనెల 14లోపే ఖాళీ చేయాలంటూ నోటీసులో పేర్కొన్నారు. దీంతో గురువారం పన్నీర్ సెల్వం కొత్త ఇంటిలోకి మారారు.

More Telugu News