: ఏపీలో టెంకాయ కొట్టేందుకు సిద్ధమవుతున్న ‘హీరో’ కంపెనీ.. ఉగాది నాడే ముహూర్తం!

నవ్యాంధ్రకు కొత్త కంపెనీల రాక మొదలైంది. ప్రభుత్వం తమకు కేటాయించిన భూమిలో శంకుస్థాపన చేసుకునేందుకు ద్విచక్ర వాహన దిగ్గజం ‘హీరో’ సిద్ధమవుతోంది. ఉగాది పర్వదినాన ప్లాంటు నిర్మాణానికి టెంకాయ కొట్టాలని భావిస్తోంది. శ్రీ సిటీ సెజ్‌లో తనకు కేటాయించిన భూమిని గురువారం రిజిస్ట్రేషన్ చేయించుకుంది. ఈ భూమి ఇప్పటి వరకు వివాదంలో ఉండడంతో ‘హీరో’ రిజిస్ట్రేషన్‌కు రాలేదు. ప్రభుత్వ చర్చలు, సంప్రదింపుల తర్వాత వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకుంది.

ప్రభుత్వం తొలుత చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం మాదన్నపాలెంలో హీరో మోటార్స్ కార్ప్‌కు 600 ఎకరాల భూమి కేటాయించింది. అయితే ఈ భూమిపై వివాదాలు ఉండడంతో వేరే చోట భూమి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీనికి హీరో ససేమిరా అంది. అదే కావాలని పట్టుబట్టింది. దీంతో రంగంలోకి దిగిన పరిశ్రమల శాఖ వివాదాలను పరిష్కరించి రిజిస్ట్రేషన్‌కు సిద్ధం చేసింది.

గతేడాది మార్చి 31న హీరోతో  ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం ఇక్కడ నిర్మించబోయే ప్లాంటులో త్రిచక్ర ఎలక్ట్రిక్ వాహనాలు, ఏరోస్పేస్-టెక్నాలజీలను గ్రీన్ టెక్నాలజీ ద్వారా ఉత్పత్తి చేయాలి. అయితే సంస్థ అభ్యర్థన మేరకు ప్రభుత్వం త్రీవీలర్స్ అని ఒప్పందంలో ఉన్న పదానికి బదులు త్రీవీలర్స్ అండ్ మొబిలిటీ సొల్యూషన్స్ అనే పదాన్ని చేర్చారు. కాగా ప్రముఖ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ  హెచ్‌సీఎల్ కూడా అమరావతిలో కార్యకలాపాలకు సిద్ధమవుతోంది. గన్నవరం విమానాశ్రయం సమీపంలో ప్రభుత్వం కేటాయించిన వంద ఎకరాల్లో డెవలప్‌మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. హెచ్‌సీఎల్ కూడా ఉగాది నాడే ప్లాంటుకు శ్రీకారం చుట్టాలని భావిస్తోంది.

More Telugu News