: ఆ ఉగ్రవాది తండ్రి భారతమాతకు గర్వకారణం: పార్లమెంట్ లో రాజ్ నాథ్ మెచ్చుకోలు

లక్నోలో భద్రతా దళాల ఎన్ కౌంటర్ లో మరణించిన ఉగ్రవాది సైఫుల్లా తండ్రిని చూసి దేశమంతా గర్విస్తోందని హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. పార్లమెంట్ మలివిడత బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కాగా, లక్నోలో జరిగిన ఎన్ కౌంటర్ పై ప్రకటన చేస్తూ, ఉగ్రవాదిగా మారిన తన బిడ్డ మృతదేహాన్ని తాను తీసుకోబోనని ఆయన చెప్పడం, దేశం పట్ల ఆయనకున్న అవ్యాజమైన ప్రేమకు నిదర్శనమని కొనియాడారు.

సైఫుల్లా ఎన్ కౌంటర్ పై లోక్ సభలో ఈ ఉదయం ప్రకటన చేసిన ఆయన, ఎన్ కౌంటర్ లో పాల్గొన్న సైన్యం, సైఫుల్లాను ప్రాణాలతో పట్టుకునేందుకు ఎంతో ప్రయత్నించిందని, అయితే, లొంగిపోవడానికి అతను తిరస్కరించి, కాల్పులు జరపడంతో, సైఫుల్లాను చివరికి హతమార్చక తప్పలేదని అన్నారు. లక్నో ఎన్ కౌంటర్ వెనుక ఐఎస్ఐఎస్ హస్తంపై ఎన్ఐఏ పూర్తి విచారణ జరుపుతుందని అన్నారు. ఇండియన్స్ పై అమెరికాలో జరుగుతున్న దాడులను ఎంతో తీవ్రంగా పరిగణిస్తున్నామని, ఈ విషయంలో వచ్చే వారం ప్రభుత్వం అధికారిక ప్రకటన వెలువరిస్తుందని తెలిపారు.

ఆపై ఖర్గే మాట్లాడుతూ, అమెరికాలో భారతీయుల ప్రాణాలు పోతుంటే, ఇంకా మీనమేషాలు లెక్కిస్తూ కూర్చోవడం ఏంటని ప్రధానిని విమర్శించారు. ఎన్ఆర్ఐ కూచిభొట్ల శ్రీనివాస్ హత్యను ఆయన ప్రస్తావించారు. ప్రధాని మౌనంగా ఎందుకు ఉన్నారని, అమెరికాకు నిరసన ఎందుకు తెలియజేయడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు.

More Telugu News