: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే ఆశావహులకు గుడ్ న్యూస్.. వచ్చే ఎన్నికల్లో పెరగనున్న అసెంబ్లీ సీట్లు!

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వచ్చే శాసనసభ ఎన్నికల కోసం ఎదురుచూస్తున్న ఎమ్మెల్యే ఆశావహులకు ఇది పండుగలాంటి వార్త. అలాగే రెండు రాష్ట్రాల్లోని అధికార పార్టీలకూ శుభవార్తే. అధికారంలోకి వచ్చాక అటు టీఆర్ఎస్, ఇటు టీడీపీల్లోకి వలసలు పెరిగాయి. పెద్ద సంఖ్యలో పార్టీల్లో మార్పులు చేర్పులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో వీలైనంతమందికి అవకాశం కల్పించడం ద్వారా పార్టీలో చేరిన వారికి, పార్టీని నమ్ముకుని ఉన్నవారికి న్యాయం చేయాలని టీఆర్ఎస్, టీడీపీలు భావించాయి. నియోజకవర్గాల పెంపుతో అది సాధ్యమవుతుందన్న నమ్మికతో వారికి ఎడాపెడా హామీలిచ్చాయి. అయితే, కొంతకాలంగా ఈ విషయంలో ఎటువంటి కదలిక లేకపోవడంతో కొంత నిరుత్సాహం చెందాయి. తాజాగా ఇప్పుడీ ప్రతిపాదనలో కదలిక రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.

 రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం ఏపీలో ఉన్న 175 స్థానాలను 225కు, తెలంగాణలో 119 నుంచి 153కు  అసెంబ్లీ స్థానాలను పెంచాల్సి ఉంది. ఈ విషయంలో గత కొంతకాలంగా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కేంద్రంపై ఒత్తిడి తేవడంతో నియోజకవర్గాల పెంపు బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఈ మేరకు ‘అడ్మినిస్ట్రేటివ్ రిపోర్ట్’ పంపాలని కేంద్ర నాయశాఖ రెండు తెలుగు రాష్ట్రాలను కోరింది. లోక్‌సభ  స్థానాల పెంపు సాధ్యం కాకపోవడంతో వాటి పరిధిలోకి వచ్చే అసెంబ్లీ స్థానాలను మాత్రం పెంచాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాలను తొమ్మిదికి పెంచాలని కేంద్రం భావిస్తోంది.

More Telugu News