: భారత్‌లో ఉగ్ర దాడులకు సాయం చేసిన ఎన్నారైకి అమెరికాలో జైలుశిక్ష!

అమెరికాలో స్థిరపడి భారత్ లో ఉగ్రదాడులకు సహకరించిన వ్యక్తికి అమెరికా కోర్టు జైలు శిక్ష విధించింది. భారత్‌కు చెందిన బల్వీందర్‌ సింగ్‌ (42) అమెరికాలో స్థిరపడ్డాడు. గతంలో పంజాబ్ లో జరిగిన ఖలిస్థాన్ ఉద్యమ సమయంలో ఉగ్రదాడులకు, ఓ ప్రభుత్వ అధికారిని హత్యచేసేందకు ఉగ్రవాదులకు సహాయపడ్డాడని బల్వీందర్ సింగ్ పై ఆరోపణలు వున్నాయి. ఆ ఆరోపణలు రుజువు కావడంతో నేవెడా రాష్ట్రం రెనో నగరంలోని యూఎస్‌ డిస్ట్రిక్ట్‌ జడ్జి లారీ హిక్స్‌ అతడిని దోషిగా నిర్ధారించి  15 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు.

అమెరికాలో శాశ్వత నివాస హోదా ఉన్న బల్వీందర్‌ 2013 సెప్టెంబరు, డిసెంబరు మధ్య కాలంలో పంజాబ్‌లో జరిగిన ఖలిస్థాన్‌ ఉద్యమ సమయంలో ఉగ్రదాడులకు సహకరించారని, అతడితో పాటు మరో ఇద్దరు కుట్రదారులకు కూడా ఇందులో భాగస్వామ్యం ఉందని.. వీరిలో ఒకరు భారత్‌కు వెళ్లి భారతీయ అధికారిని చంపాలనుకున్నారని రుజువైంది. 2013 నవంబరులో బల్వీందర్‌ రెండు నైట్‌ విజన్‌ గాగుల్స్‌, ల్యాప్‌టాప్‌ కొని, దాడికి పాల్పడాలనుకున్న వ్యక్తికి అందజేసినట్లు విచారణలో తేలింది. ఆ వ్యక్తి బ్యాంకాక్‌ వెళ్లేందుకు శాన్‌ఫ్రాన్సిస్‌కో అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ఎక్కేందుకు ప్రయత్నించగా అధికారులు పట్టుకుని పూర్తి విచారణ చేయగా ఈ కేసుకు సంబంధించిన వివరాలు బయటపడ్డాయి. అమెరికాను, తన మిత్ర దేశాలను రక్షించడానికి అమెరికాలోని మల్టి-లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలు కలిసి పనిచేస్తున్నాయని చెప్పడానికి ఈ కేసు నిదర్శనమని యూఎస్‌ అటార్నీ జనరల్‌ డేనియల్‌ బోగ్డెన్‌ తెలిపారు.  

More Telugu News