: ముంబైకి చెందిన ఆ రెండు కుక్కలకు ఐదు కోట్ల ఆస్తి!

ముంబైలోని గోల్డెన్ ట్రైవరీ జాతికి చెందిన బడ్డీ, టైనీ అనే కుక్కలు 5 కోట్ల ట్రస్టుకు వారసులవుతాయి. ఆ వివరాల్లోకి వెళితే, ఆ నగరానికి చెందిన నందిని సచ్ దే, నిమేష్ సచ్ దే దంపతులకు పిల్లలు లేరు. దీంతో వీరు తిరగని ఆసుపత్రి లేదు, మొక్కని దేవుడు లేడు. ఈ క్రమంలో వారికి ఒక బిడ్డ పుట్టి పురిట్లోనే మరణించి వారిని మరింత బాధలోకి నెట్టేసింది. దీంతో బిడ్డలు లేని బాధను పోగొట్టుకునేందుకు 2003 నవంబర్ 14న నిమేష్ మూడు కుక్కలను తెచ్చారు. అప్పటి నుంచి నందిని, నిమేష్ దంపతులకు ఆ కుక్కలే సర్వస్వం అయిపోయాయి.

అప్పటి నుంచి వాటి ఆలనాపాలన చూసుకుంటున్న ఆ దంపతులు ఆ కుక్కలనే పిల్లల్లా చూసుకుంటున్నారు. 2016లో ఒక కుక్క మరణించింది. ఈ క్రమంలో నందినికి గుండె సంబంధ సమస్య ఉన్నట్టు వైద్యపరీక్షల్లో తేలింది. దీంతో ఆందోళన చెందిన ఆ దంపతులు తమ తదనంతరం కుక్కలకు ఎలాంటి కష్టం రాకుండా తమ ఆస్తిపాస్తులతో కుక్కల సంరక్షణ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ 5 కోట్ల రూపాయలతో ఒక ట్రస్టు ఏర్పాటు చేసి, దాని ద్వారా వచ్చే డబ్బుతో కుక్కల ఆలనాపాలన చూసుకునేలా చర్యలు చేపట్టనున్నారు. కుక్కలకు ఆస్తిపాస్తులా? అని ఎవరైనా ప్రశ్నిస్తే...అవి కుక్కలు కాదు, మా పిల్లలు అని వారిద్దరూ సమాధానమిస్తారు. మనుషుల కంటే జంతువులే చాలా మంచివని వారు చెబుతున్నారు. అవి మాట్లాడలేవు కానీ భావోద్వేగాలు పలికిస్తాయని వారు పేర్కొంటున్నారు. 

More Telugu News