: ఏపీ స్పీకర్ పై తెలంగాణలో కేసు నమోదు.. సమన్లు జారీ

ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై తెలంగాణలో కేసు నమోదయింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ ఆయనపై కరీంనగర్ స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్టులో కేసు నమోదైంది. 2016 జూలై 11న కరీంనగర్ కు చెందిన సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసు వివరాల్లోకి వెళ్తే, 2016 జూన్ 19న ఓ టీవీ చానల్ లో కోడెల ఇంటర్వ్యూ ప్రసారమైంది. ఇందులో భాగంగా, ఎన్నికలకు సంబంధించిన విషయాలు కూడా చర్చకు వచ్చాయి. తాను మొదటిసారి 1983లో పోటీ చేసినప్పుడు రూ. 30 వేలు మాత్రమే ఖర్చయ్యాయని... అవి కూడా ప్రజల నుంచి వచ్చిన చందాలు లాంటివని కోడెల చెప్పారు. చివరి ఎన్నికల్లో మాత్రం రూ. 11.50 కోట్లు ఖర్చయిందని చెప్పారు.

దీంతో, ఎన్నికల కమిషన్ నిర్ణయించిన ఖర్చు కంటే కోడెల 40 రెట్లు ఎక్కువ ఖర్చు చేశారంటూ సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఫిర్యాదును తాను తొలుత స్థానిక త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో చేసినప్పటికీ పట్టించుకోలేదని... అందుకే నేరుగా కోర్టులో పిటిషన్ వేశానని ఆయన చెప్పారు. ఆ తర్వాత ఈ కేసును ఎన్నికలకు సంబంధించిన న్యాయస్థానానికి బదిలీ చేశారని... అయితే, అక్కడ కొన్ని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని ఆయన తెలిపారు. దీంతో భాస్కర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా... కేసును విచారణకు స్వీకరించాలని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో, ఈ కేసు కరీంనగర్ స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టుకు బదిలీ అయింది. కేసును విచారించిన కోర్టు ఏప్రిల్ 20వ తేదీన తమ ముందు హాజరు కావాలంటూ కోడెలకు సమన్లు జారీ చేసింది.  

More Telugu News