: టీవీలు, స్మార్ట్ ఫోన్ల ద్వారా గూఢచర్యం చేస్తున్న సీఐఏ: వికీలీక్స్ సంచలన ఆరోపణ

అగ్రరాజ్యానికి సంబంధించిన పలు సంచలన రహస్యాలను వెలుగులోకి తెచ్చిన అసాంజే నేతృత్వంలోని వికీలీక్స్, తాజాగా యూఎస్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజన్సీ (సీఐఏ) స్మార్ట్ ఫోన్లు, టీవీలను వాడుతూ, పలు దేశాలపై గూఢచర్యం చేస్తోందని ఆరోపిస్తూ, అందుకు సంబంధించిన వేలాది డాక్యుమెంట్లను బయటపెట్టింది. సీఐఏ తన హ్యాకింగ్ ప్రోగ్రాముల్లో భాగంగా, ఈ చర్యలకు పాల్పడుతోందని చెబుతూ, టీవీలను ఎలా హ్యాకింగ్ కు వాడుతున్నారో స్పష్టంగా చెబుతున్న దస్త్రాలను వెలుగులోకి తెచ్చింది.

శాంసంగ్ స్మార్ట్ టీవీల్లో మైక్రోఫోన్లను సీఐఏ చొప్పించిందని, దీని ద్వారా, టీవీని ఆఫ్ చేసిన తరువాత కూడా ఇవి పనిచేస్తూ, అక్కడి మాటలను రికార్డు చేస్తాయని పేర్కొంది. స్మార్ట్ టీవీలతో పాటు, ఇంటర్నెట్ తో అనుసంధానమైన ప్రతి ప్రొడక్టునూ సీఐఏ హ్యాక్ చేస్తోందని తెలిపింది. ప్రపంచంలోని ఏ సిస్టమ్ కూడా హ్యాకింగ్ నుంచి పూర్తి రక్షణ ఇవ్వలేదని, ఏ స్మార్ట్ సమాచారమైనా తెలుసుకునేలా సీఐఏ సాంకేతికతను వాడుతోందని పేర్కొంది. ఐఫోన్లు కూడా మినహాయింపు కాదని వెల్లడించింది.
కాగా, తాజా ఆరోపణలపై సీఐఏ మాత్రం స్పందించలేదు. స్వతంత్ర సైబర్ సెక్యూరిటీ నిపుణులు, ఇంటెలిజెన్స్ విభాగం ఉద్యోగులు ఈ ఆరోపణలు వాస్తవం అయి వుండవచ్చని నమ్ముతున్నారు.

More Telugu News