: ఫేస్‌బుక్ ఫ్రెండ్ సాయంతో హైద‌రాబాద్ వ‌చ్చిన బాలిక‌.. పోలీసులను పరుగెట్టించిన వైనం

నిన్న హైద‌రాబాద్‌లో ఓ బాలిక త‌న బాధ‌ల‌ను మాన‌వ‌హ‌క్కుల క‌మిష‌న్‌కు చెప్పుకొని అనంత‌రం పోలీసుల‌ను ప‌రుగులు పెట్టించింది. పాతబస్తీలోని నూరినగర్‌లో నివాసం ఉండే ముంబైకి చెందిన ఓ దంప‌తులు ఇటీవ‌లే మృతి చెందారు. వారికి అలీనాఖాన్ అనే ఓ అమ్మాయి ఉంది. మార్బుల్‌ వ్యాపారం చేసే ఆమె తండ్రి పేరిట రూ.కోట్ల ఆస్తులున్నాయి. అయితే, ఆమెకు పిన్ని వరసయ్యే ఆర్షియా కొన్ని నెలల క్రితం ఆ బాలికను త‌నతోపాటు బెంగుళూరుకు తీసుకెళ్లింది. తాజాగా బెంగ‌ళూరు నుంచి హైద‌రాబాద్‌కు వ‌చ్చిన ఆ బాలిక మాన‌వ‌హ‌క్కుల క‌మిష‌న్ అధికారుల‌తో త‌న‌ పేరుపై ఆస్తులు ఉన్నందున త‌న పిన్ని తనను చేరదీసిందని పేర్కొంది. త‌నపై వేడినీళ్లు పోస్తూ, హింసిస్తోంద‌ని చెప్పింది. ఈ విష‌యాన్ని అధికారులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.

అయితే, ఆ బాలిక బెంగ‌ళూరు నుంచి ఇక్క‌డ‌కు ఎలా వ‌చ్చిందో తెలుసుకున్న పోలీసులు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. త‌న‌కు ఫేస్‌బుక్ ద్వారా ప‌రిచ‌య‌మైన హైద‌రాబాద్‌లోని స‌య్య‌ద్ అనే యువ‌కుడి సాయంతో ఇక్క‌డకు వ‌చ్చాన‌ని చెప్పింది. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వెంటనే స్పందించి బెంగళూరు పోలీసు అధికారులకు ఈ విష‌యాన్ని తెలిపారు. అయితే, అలీనాఖాన్ పిన్ని పోలీసుల‌కు పలు విషయాలు తెలిపింది. సయ్యద్‌ మాయమాటలు చెప్పి అలీనాను లోబర్చుకున్నాడంటూ ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు విచారించి సయ్యద్‌పై అపహరణ కేసును నమోదు చేశారు. ఈ కేసులో స‌య్య‌ద్ స్నేహితులు మహ్మద్‌ అజర్‌ సిద్ధిఖి, మహ్మద్‌రఫీక్‌, మహ్మద్‌ ఎక్బాల్‌ల‌ను కూడా అరెస్ట్ చేశారు.
 
హైద‌రాబాద్ పాత‌బ‌స్తీలో ఉండే సయ్యద్ ఫేస్‌బుక్‌ ద్వారా అలీనాతో ప్ర‌తిరోజు చాటింగ్ చేసేవాడ‌ని పోలీసులు తెలిపారు. అలీనా తన పిన్ని త‌న‌ను వేధిస్తోందని చెప్పగానే గత నెల 26న తనవద్దకు రావాలని చెప్పాడని అన్నారు. అదేరోజు రాత్రి అలీనా హైద‌రాబాద్ వ‌చ్చింద‌ని అన్నారు. సయ్యద్ అలీనాను త‌న‌ ఇంటికి తీసుకెళ్లకుండా అతడి స్నేహితుడు మహ్మద్‌ అజర్‌సిద్దీఖీ సాయంతో భవానినగర్‌లో ప్లాస్టిక్‌ పనులుచేసే మహ్మద్‌ రషీద్‌ ఇంట్లో ఉంచాడ‌ని చెప్పారు. స‌య్య‌ద్‌తో పాటు అత‌డి స్నేహితుల‌పై బాలికను అపహరించడంతో పాటు ప‌లు కేసులు పెట్టామ‌ని, పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశామ‌ని పోలీసులు చెప్పారు. కేసులో వాస్తవాలను రాబట్టడానికి పోలీసులు విచారణ జరుపుతున్నారు.

More Telugu News