: మారుతున్న చైనా... మసూద్ పై నిషేధం దిశగా అడుగులు!

పాక్ కేంద్రంగా భారత్ పై ఉగ్రదాడులకు దిగుతున్న టెర్రరిస్ట్ మసూద్ అజర్ పై నిషేధం విధించే విషయంలో ఇప్పటివరకూ సాంకేతిక కారణాలు, సాక్ష్యాలు అంటూ మీనమేషాలు లెక్కిస్తూ వచ్చిన చైనా, ఇప్పుడు మనసు మార్చుకుంటోంది. మసూద్ పై ఐరాస టెర్రర్ కేటలాగ్ ప్రకారం, విచారణ జరిపే అంశంపై సానుకూల ధోరణితో ఉన్నట్టు సంకేతాలు పంపింది.

చైనాలో సైతం ఉగ్రవాద ఛాయలు రోజురోజుకూ పెరుగుతున్న వేళ, ఐరాస నిర్ణయాలకు మద్దతిచ్చే అంశంపై ఆలోచిస్తున్నామని, అన్ని కోణాల్లో పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చైనా అధికారి మా క్సియాంగ్వూ వెల్లడించారు. న్యూఢిల్లీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్ ఆధ్వర్యంలో 19వ ఆసియా సెక్యూరిటీ సదస్సు జరుగుతుండగా, అందులో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మాట్లాడారు.

కాగా, జైషే మొహమ్మద్ చీఫ్ గా ఉన్న మసూద్ ఆధ్వర్యంలోనే గత సంవత్సరం జనవరి 2న పఠాన్ కోట్ పై ఉగ్రదాడి జరిగిందని భారత్ సాక్ష్యాలు చూపిన సంగతి తెలిసిందే. అతనిపై అంతర్జాతీయ ఉగ్రవాది ముద్ర వేయాలని ఐరాసలో తీర్మానం రాగా, చైనా వీటో చేసిన సంగతి తెలిసిందే. ఇదిలావుండగా, చైనా దేశానికి చెందిన ఉఘుర్ ప్రాంత మిలిటెంట్ గ్రూపులకు తాలిబాన్లు శిక్షణ ఇస్తున్నారని, అందువల్లే ఉగ్రవాదులపై చైనా తన వైఖరిని మార్చుకుంటోందని నిపుణులు వ్యాఖ్యానించారు. తాలిబాన్ల రాజ్యంలో 320 మంది చైనా ఉగ్రవాదులు శిక్షణ పొందుతున్నట్టు తాము గుర్తించినట్టు ఈ సందర్భంగా మా క్వియాంగ్వూ వెల్లడించడం గమనార్హం.

More Telugu News