: మళ్లీ మొదటికి.. ఏటీఎంలలో మళ్లీ దర్శనమిస్తున్న ‘నో క్యాష్’ బోర్డులు

మళ్లీ మొదటికొచ్చింది. నోట్ల రద్దునాటి పరిస్థితులు మళ్లీ దర్శనమిస్తున్నాయి. చెస్ట్‌లు చేతులెత్తేయడంతో బ్యాంకులు బిక్క మొహం వేస్తున్నాయి. ఫలితంగా సామాన్యులు అవస్థలు పడుతున్నారు. బ్యాంకుల్లోనూ డబ్బులు లేక, ఏటీఎంలలో అవి కనిపించక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డబ్బులివ్వాల్సిన ఏటీఎంలు ‘నో క్యాష్’ బోర్డులతో దర్శనమిస్తుండడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియని బాధతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. ఇక పింఛన్‌దారుల అవస్థలైతే చెప్పక్కర్లేదు. ‘ఫిబ్రవరి నుంచి పండుగే. ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు’ అంటూ ఊదరగొట్టిన ప్రభుత్వం మాటలకు ప్రస్తుతం పూర్తి భిన్నమైన పరిస్థితులు కనబడుతున్నాయి.

డబ్బులిచ్చే చెస్ట్‌లు బ్యాంకులను మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నాయి. ఫిచన్లు, జీతాలు, నెలసరి ఖర్చులు కలిసి ఫిబ్రవరి నెలలో గుంటూరు జిల్లాకు నెలసరి ఖర్చులకే రూ.450 కోట్లు కావాలి. కానీ వచ్చింది మాత్రం రూ.245 కోట్లే. ఫలితంగా నగదు కొరత తీవ్రమైంది. కరీంనగర్‌లోని ఓ ఎస్‌బీఐ శాఖలో నోట్ల రద్దుకు ముందు రోజు వరకు రూ.50 లక్షలు ఖాతాదారులకు ఇచ్చేవారు. నోట్ల రద్దు తర్వాత అది రూ.5 లక్షలకు పడిపోయింది. ఇప్పుడైతే వారానికి రూ.50 లక్షలు మాత్రమే ఇస్తున్నారు. ఖాతాదారుల అవసరాలు తీర్చలేక బ్యాంకులు కూడా నానా పాట్లు  పడుతున్నాయి. ఇక ఏటీఎంలలో ప్రతి నెల మొదటి వారంలో రూ.150 కోట్లు పెట్టే ఓ బ్యాంకు ఇప్పుడు రూ.40 కోట్లు మాత్రమే పెడుతోంది.  

పెద్ద నోట్ల రద్దు సందర్భంగా చేసిన డిపాజిట్లను ఆర్బీఐ తిరిగి పూర్తిస్థాయిలో విడుదల చేయడం లేదని బ్యాంకులు ఆరోపిస్తున్నాయి. అప్పటి డిపాజిట్లలో కేవలం 25-50 మధ్య మాత్రమే ఇస్తోందని విమర్శిస్తున్నారు. నోట్ల రద్దు తర్వాత గుంటూరు నుంచి రూ.13 వేల కోట్లను ఆర్బీఐకి పంపిస్తే వచ్చింది మాత్రం కేవలం రూ.3 వేల కోట్లు. తెలుగు రాష్ట్రాల్లో ఏ జిల్లాకు 50 శాతానికి మించి డిపాజిట్లు వెనక్కి ఇవ్వలేదు. ఆర్బీఐ నుంచి తక్కువ మొత్తంలో నగదు వస్తుండడమే నోట్ల కష్టాలకు ప్రధాన కారణమని చెబుతున్నారు. ప్రస్తుత కష్టాలకు మరో కారణం డిపాజిట్లను వెనక్కి తీసుకోవడం. నోట్ల రద్దు సమయంలో పెద్దమొత్తంలో బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన ఖాతాదారులు ఇప్పుడు వాటిని వెనక్కి తీసుకుంటున్నారు. దీంతో మార్కెట్లో నగదు చలామణి తగ్గిపోయింది. ఈ కారణంగానే మళ్లీ నోట్ల రద్దునాటి పరిస్థితులు కనిపిస్తున్నాయని, నగదు కొరత ఏర్పడిందని బ్యాంకులు చెబుతున్నాయి. అలాగే బయటకు వెళ్లిన రూ.2 వేల నోట్లలో దాదాపు రూ.40 వేల కోట్లు తిరిగి వెనక్కి రాకపోవడం కూడా ఓ కారణమని వివరించారు.

More Telugu News