: ఎవరైనా 'వైఫై' కేంద్రాలు పెట్టుకుని డబ్బు సంపాదించవచ్చు... నిబంధనలు మార్చుతున్న ట్రాయ్

దేశవ్యాప్తంగా వ్యక్తులు, కమ్యూనిటీలు, ఔత్సాహికులు వైఫై కేంద్రాలను ఏర్పాటు చేసుకుని, డబ్బు సంపాదించేలా టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నిబంధనలను మార్చాలని భావిస్తోంది. ప్రతి ఒక్కరికీ హై-స్పీడ్ ఇంటర్నెట్ ను చౌక ధరకు అందించాలన్న లక్ష్యంలో భాగంగా వైఫై కేంద్రాల అభివృద్ధిపై దృష్టి సారించిన ట్రాయ్, ప్రస్తుతం ఒక ఎంబీ డేటాకు వసూలు చేస్తున్న 10 పైసలను 2 పైసలకు తగ్గించాలని కూడా భావిస్తోంది. డేటా ఖర్చు తగ్గితే, మరింత మంది ఇంటర్నెట్ పరిధిలోకి వస్తారని అంచనా వేస్తున్న ట్రాయ్, ఇందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు ట్రాయ్ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. వైఫై కేంద్రాలు పెరిగితే, టెలికం ఆపరేటర్లపై ఉన్న డేటా లోడ్ భారం కూడా తగ్గుతుందని ఆయన అన్నారు. ఇందుకు సంబంధించి, తాము తయారు చేసిన సిఫార్సుల నివేదికను త్వరలోనే టెలికం మంత్రిత్వ శాఖకు అందించనున్నామని, లైసెన్సింగ్ విధానాల్లో మార్పులు, ఇతర నిబంధనలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

More Telugu News